లండన్, ఆగస్టు 23: స్కాట్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా ముగ్గురు మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన బాషెట్టి పవన్(23)తో పాటు ఏపీలోని నెల్లూరుకు చెందిన యువకుడు మోదేపల్లి సుధాకర్(30), బెంగళూరుకు చెందిన గిరీశ్ సుబ్రమణ్యం(23) ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన హైదరాబాద్‌కు చెందిన 24 ఏండ్ల సాయివర్మ ప్రస్తుతం గ్లాస్గోలోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 19న స్కాటిష్ హైల్యాండ్‌లోని అప్పిన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది.
విహారయాత్రలో విషాదం!
పవన్ బాషెట్టి, గిరీశ్ సుబ్రమణ్యం, సాయివర్మ లండన్‌లోని లైసెస్టర్ యూనివర్సిటీలో చదువుతున్నారు. విహారయాత్రకు వెళ్లినట్టుగా భావిస్తున్న ఈ నలుగురు ప్రయాణిస్తున్న కారును ఓ భారీ వాహనం ఢీకొన్నదని స్కాట్లాండ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి 47 ఏండ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలిపారు. విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేసి భారత్‌కు పంపించేందుకు అక్కడి ఇండియన్ కాన్సులేట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు స్కాట్లాండ్లోని ప్రవాస భారతీయులతో పాటు ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్(ఐఎన్ఎస్ఏ)-యూకే కూడా సహకరిస్తున్నది.
కన్నీరుమున్నీరుగా పవన్ కుటుంబం..
చంపాపేట, ఆగస్టు 23: రోడ్డు ప్రమాదంలో బాషెట్టి పవన్ మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజామాబాద్‌కు చెందిన బాషెట్టి జగదీశ్, శ్యామల దంపతులు నగర శివారు కర్మన్‌ఘాట్ సమీపంలో ఉండే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో స్థిరపడ్డారు. పదేండ్ల నుంచి బియ్యం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు(పవన్), ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం అయింది. మృతదేహాన్ని తెప్పించేందుకు మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సంప్రదిస్తున్నామని బంధువులు తెలిపారు.