“అతడి పేరు కల్యాణ్. డిగ్రీ ఉత్తీర్ణుడు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. తనకు తెలిసిన స్నేహితుడి సాయంతో అమీర్‌పేట్‌లోని ఓ కాల్ సెంటర్‌కు ఇంటర్వ్యూకి వెళ్లాడు. అది అతడికి ఆరో ఇంటర్వ్యూ. అది కూడా ఫెయిల్ అయింది. అన్ని ప్రశ్నలకు సమాధానం కరెక్ట్‌గానే చెబుతున్నా కానీ ఉద్యోగానికి ఎంపిక అవడం లేదని బాధపడుతుంటే వాడు. ఈ విషయాన్ని అక్కడే ఉద్యోగం చేస్తున్న వారికి చెప్పగా వారు ఇంటర్వ్యూలో పాటించాల్సిన విధానాన్ని చెప్పారు. అదే బాడీ లాంగ్వేజీపై చర్చించారు. విషయం తెలుసుకున్న కల్యాణ్ ఆ మరుసటి రోజు ఓ బ్యాంక్‌కు సంబంధించిన లోన్స్ విభాగానికి ఇంటర్వ్యూకి వెళ్లి సక్సెస్ అయ్యాడు.”
“ఆమె పేరు పూజ. ఎంటెక్ పూర్తి చేసింది. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరైంది. అందులో ఆమె సెలెక్ట్ అవ్వలేదు. కారణం ఆమె బాడీ లాంగ్వేజీ. ఇంటర్వ్యూ మధ్యలో ఎటో చూస్తూ మాట్లాడటం, చివర్లో చటుక్కున వెళ్లిపోవడం, వినిపించకుండా తనలో తానే మాట్లాడుకోవడం ఇలాంటి కారాణాలతో ఆమె ఆ కొలువుకు దూరం కావల్సి వచ్చింది.” అని ఓ కంపెనీ రిక్రూట్మెంట్ విభాగం ప్రతినిధి తెలిపారు.
Interview skills | సిటీబ్యూరో, మే 16 ( నమస్తే తెలంగాణ ) :ఉపాధి చూపించడంలో హైదరాబాద్ టాప్. విభిన్న రకాల కొలువులకు అడ్డా. అందుకే చాలా మంది నగరానికి వచ్చి స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తారు. చదువు పూర్తవడమే ఆలస్యం హైదరాబాద్‌కు వచ్చి సంబంధిత రంగాల్లో ఉద్యోగ వేటలో పడుతుంటారు. హోటల్ రంగం నుంచి ఐటీ వరకు మంచి ప్యాకేజీలతో అర్హతకు తగ్గ జాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలు సాధించడమే అసలైన టాస్క్‌గా నిపుణులు చెబుతున్నారు. కొన్ని సంస్థలు ఉద్యోగాలు పొందేలా సంబంధిత నైపుణ్యం అందించడానికి శిక్షణా సంస్థలు కూడా నెలకొల్పాయి. మరికొందరూ డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు అందిస్తున్నాయి. ఏ కొలువు అయినప్పటికీ ఇంటర్వ్యూను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే ఉద్యోగం దక్కుతుంది. సంబంధిత రంగాన్ని బట్టి ఇంటర్వ్యూల లెవల్స్ ఆధారపడి ఉంటాయి. సబ్జెక్ట్ ఏదైనా.. ఇంటర్వ్యూలో కొన్ని మెలకువలు పాటిస్తే కచ్చితంగా ఉద్యోగం సంపాదించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
సంతోషం, ఆందోళన మనసును బట్టి, ఆలోచన దృక్ఫథాన్ని బట్టి ఉంటుంది. మదిలోని భావాలు ముఖంలో స్పష్టంగా తెలిసిపోతాయి. ఆనందంగా ఉన్నప్పుడు మెదడులో సెంటోనినన్, ఆందోళనలో ఉంటే కార్జిజాల్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా ముఖ కవలికల్ని మార్చేస్తాయి. ఇంటర్వ్యూ చేసే వారు ముఖంలోని హావభావాలను పరిశీలిస్తుంటారు. చదువుతో నిమిత్తం లేకుండా మానసిక స్థితిని అంచనావేసి అన్ని సరిపోతేనే కొలువులిస్తారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాడీ లాంగ్వేజీని మెరుగుపరుచుకోవాలి. -శివ, వ్యక్తిత్వ వికాస నిపుణులు.
ప్రతి చిన్నదానికి భయం వద్దు. ఇంటర్వ్యూకు వెళ్లేముందు ఆందోళన అస్సలే వద్దు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడాలి. ప్రతిరోజు కనీసం అరగంట పాటూ ధ్యానం చేయాలి. అన్నింటి కంటే ముఖ్యంగా మనం ఏ ఉద్యోగానికి వెళ్తున్నామో దానిని ఇష్టపడాలి. మీ ముఖంపై ఆనందం మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. చిరునవ్వు ఒత్తిడిని మటుమాయం చేసే గొప్ప ఔషధం. సబ్జెక్టు, నైపుణ్యంతో పాటు బాడీ లాంగ్వేజీ కూడా కీలకమని గుర్తుంచుకోవాలి.
-నందిత, సైకాలజిస్టు.