గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ
- ఛెక్కేపే ఛెక్కా
- ఆఖరి రెండు బంతుల్లో తెవాటియా సిక్సర్లు
- శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్.. పంజాబ్‌పై గుజరాత్ గెలుపు
- నరాలు తెగే ఉత్కంఠ పోరులో గుజరాత్ ఘన విజయం
- సాధించింది. కళాత్మక ఇన్నింగ్స్‌తో గిల్ వేసిన పునాదిపై..
తెవాటియా కండ బలంతో అద్భుత సౌధాన్ని నిర్మించాడు! గుజరాత్ విజయానికి చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో తెవాటియా.. భారీ సిక్సర్లతో పంజాబ్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాక్కెళ్లాడు! అంతకుముందు లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగినా.. రషీద్ ఖాన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌కు కళ్లెం వేశాడు!
ముంబై: చివరి వరకు ఉత్కంఠ ఊపేసిన పోరులో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కొత్త ఫ్రాంచైజీ.. తాజా సీజన్లో వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ (27 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా.. శిఖర్ ధవన్ (35), జితేశ్ శర్మ (23), రాహుల్ చాహర్ (14 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3, దర్శన్ నల్కండే రెండు వికెట్లు పడగొట్టారు. ఒక దశలో 13 ఓవర్లకు 124/3తో పటిష్టంగా కనిపించిన పంజాబ్‌ను గుజరాత్ బౌలర్లు మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. చివర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 15; 2 సిక్సర్లు), రాహుల్ చాహర్ ధాటిగా ఆడారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (59 బంతుల్లో 96; 11 ఫోర్లు, ఒక సిక్సర్) తృటిలో శతకం చేజార్చుకోగా.. కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ (35; 4 ఫోర్లు, ఒక సిక్సర్) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) రియల్ హీరోగా అవతరించాడు. పంజాబ్ బౌలర్లలో రబడ 2 వికెట్లు పడగొట్టాడు. గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా తొలి పోరులో చెన్నైతో హైదరాబాద్.. మలి పోరులో బెంగళూరుతో ముంబై తలపడనున్నాయి.
లివింగ్‌స్టోన్ మెరుపులు
పదకొండున్నర కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న లివింగ్‌స్టోన్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. గత మ్యాచ్‌లో చెన్నైపై అర్ధశతకంతో ఆకట్టుకున్న లివింగ్‌స్టోన్.. అదే ఫామ్‌ను గుజరాత్‌పై కొనసాగించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ్రీకి పంపి తన వైఖరి తెలిపిన లివింగ్‌స్టోన్ క్రీజులో ఉన్నంత వరకు అదే జోష్ కనబర్చాడు. దర్శన్, రషీద్ ఓవర్లలో ఒక్కో సిక్సర్ బాదిన లివింగ్‌స్టోన్.. పదో ఓవర్లో 6,4,4తో విజృంభించాడు. తెవాటియా ఓవర్లో 4,6తో 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న లివింగ్‌స్టోన్.. దర్శన్‌కు మరో రెండు ఫోర్లు రుచిచూపించాడు. మధ్యలో జితేశ్, షారుక్ ఖాన్ చెరో రెండు సిక్సర్లు బాదడంతో 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 152/5తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. రషీద్ ఓకే ఓవర్లో లివింగ్‌స్టోన్, షారుక్ ఖాన్‌ను ఔట్ చేయగా.. ఆఖర్లో రాహుల్ భారీ షాట్లతో స్కోరుబోర్డును పరిగెత్తించాడు.
ఆఖరి ఓవర్ సాగిందిలా..
గుజరాత్ విజయానికి చివరి ఆరు బంతుల్లో 19 పరుగులు అవసరం కాగా.. అప్పటివరకు చక్కటి షాట్లతో ఆకట్టుకున్న గిల్ అంతకుముందు ఓవర్లోనే పెవిలియన్ చేరిపోయాడు. 20వ ఓవర్ వేసిన ఓడెన్ స్మిత్ తొలి బంతిని వైడ్‌గా వేయగా.. రెండో బంతికి అనూహ్య రీతిలో హార్దిక్ పాండ్యా రనౌటయ్యాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 17కు చేరింది. ఈ దశలో మూడో బంతికి మిల్లర్ ఫోర్ కొట్టగా.. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. ఇక మిగిలిన రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదితేనే గుజరాత్ గెలుస్తుందన్న తరుణంలో తెవాటియా రెచ్చిపోయాడు. ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా బౌండ్రీ దాటించిన తెవాటియా.. చివరి బంతిని లాంగాన్ మీదుగా ప్రేక్షకుల్లో పడేసి మ్యాచ్‌కు అదిరిపోయే ముగింపు నిచ్చాడు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

