బూర్గంపహాడ్ : స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగా నిన్నువీడిపోదురా.. అన్న అర్ధానికి కొత్త నిర్వచనం చెప్పారు ఏడు పదుల వయస్సున్న పూర్వ విద్యార్ధులు ( Reunion of Alumni ). బూర్గంపహాడ్ ( Burgampahad ) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ (Golden Jubilee ) కలయిక ఆధ్యంతం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.
ఆదివారం జక్కం పెద్ద బుచ్చయ్య మెమోరియల్ కళాశాలలో 1967-68 సంవత్సరంలో హైస్కూల్ బ్యాచ్ స్వర్ణోత్సవ కలయిక కన్నులపండువగా సాగింది. ప్రముఖ వైద్యులు చెన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో 70 ఏళ్లకు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రముఖ న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకులు, రైతులు, వ్యాపారులతో పాటు జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సల్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్థిరపడిన వీరంతా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది పూర్వ విద్యార్ధులు ఈ వేడుకలో పాల్గొని చిన్ననాటి స్నేహితులతో గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపి ప్రస్తుత జీవనశైలిని పంచుకున్నారు. అనంతరం అందరూ ఒకచోట చేరి సహఫంక్తి భోజనాలు చేశారు.
జూనియర్ కళాశాల డోనర్ జక్కం గోపయ్యతో పాటు మృతిచెందిన తమ మిత్రులకు సంతాపం తెలిపి రెండు నిముషాలు మౌనం పాటించారు. నిర్వాహకులు డాక్టర్ చెన్నం సత్యనారాయణను పూర్వ విద్యార్ధులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్యదొర, బూర్గంపహాడ్ సర్పంచ్ మందా నాగరాజు, పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.