న్యూఢిల్లీ, జూన్ 29 : బంగారం కొండదిగుతున్నది. సామాన్యుడికి అందనంత స్థాయికి చేరుకున్న ఈ అతి విలువైన లోహం దిద్దుబాటునకు గురవుతున్నది. ఈ ఏడాది తొలి నెలలో రికార్డు స్థాయికి రూ.1.93 లక్షలకు చేరుకున్న పదిగ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1.43 లక్షల దిగువకు పడిపోయింది. మొత్తంగా రూ.50 వేలు లేదా 26 శాతానికి పైగా పడిపోయింది. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం వల్లనే బంగారం కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ధరలు ఒక్కసారిగా కిందికి తగ్గాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. సమీక్ష భవిష్యత్తులో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉండటం, ద్రవ్యోల్బణం కోరలుచాస్తుండటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పుత్తడి నుంచి ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లించడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని వెల్లడించాయి. ఈ ఏడాది చివరివరకు ఫెడ్ వడ్డీరేట్లను మూడు సార్లు పెంచే అవకాశం ఉండటంతోపాటు డాలర్ బలపడుతుండటం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నది.
సమీక్ష భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు చేస్తుండటం, ఫెడ్ వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉండటంతో ధరలు దిగిరావచ్చునని ఆభరణాల వర్తకులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు గోల్డ్ ధరలు 30 శాతం వరకు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ప్రస్తుతం 4,100-4,150 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. ఈ ఏడాది మొదట్లో 5 వేల డాలర్లను అధిగమించిన విషయం తెలిసిందే.
బంగారం ధరలు భారీగా పడిపోతాయన్న అంచనా భారతీయుల్లో నెలకొన్నది. దీంతో వారు గడిచిన మూడు నెలల్లో భారీగా పాత బంగారం విక్రయాలు జరిపారని సర్వే వెల్లడించింది. గడిచిన మూడు నెలల్లో పుత్తడి ధరలు తగ్గడంతో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 50 టన్నుల బంగారాన్ని విక్రయించారట. కిందటేడాది ఇదే సమయంలో విక్రయించిన దాంతో పోలిస్తే 43 శాతం అధికం కావడం విశేషం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో చల్లారే అవకాశాలు లేకపోవడం, గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు ప్రస్తుతం దిద్దుబాటుకు గురికావడం, భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న అంచనాతోనే బంగారాన్ని భారీగా విక్రయిస్తున్నారని తెలుస్తున్నది. దీంతో పాత బంగారాన్ని విక్రయించడంతో దేశీయ దిగుమతులు తగ్గే అవకాశం ఉన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వేల టన్నుల బంగారం ఉన్నట్టు అంచనా.
గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,300 ఎగబాకి రూ.1,46,600లకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1,45,300గా ఉన్నది. కానీ, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి రూ.2,000 తగ్గి రూ.2,24, 000గా నమోదైంది. ఇటీవలకాలంలో కరెక్షన్కు గురైన గోల్డ్ ధరలు మళ్లీ రికవరీ బాట పట్టాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 54.14 డాలర్లు లేదా 1.32 శాతం తగ్గి 4,035.12 డాలర్లకు పడిపోగా, వెండి 3 శాతం తగ్గి 57.62 డాలర్లకు దిగొచ్చింది.