Murder : సెల్ఫీ దిగుతామని పక్కకు పిలిచిన ఓ కబడ్డీ ఆటగాడిని దారుణంగా హత్యచేశారు. పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని మొహాలీ (Mohali) నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు గ్యాంగ్స్టర్లు (Gangsters) తమ మనుషులతో ఈ హత్య చేయించారు. పంజాబ్‌లో కబడ్డీ టోర్నమెంట్లను నిర్వహించే ఆర్గనైజేషన్‌పై ఆధిపత్యం కోసం కొన్నేళ్లుగా గ్యాంగ్స్టర్ల మధ్య పోరు జరుగుతోంది.
ఈ పోరులో భాగంగా ఇప్పటికే ముగ్గురు కబడ్డీ ప్లేయర్లను హత్య చేశారు. తాజాగా మొహాలీలో కన్వర్ దిగ్విజయ్ సింగ్ అలియాస్ రాణా బాలచౌరియా అనే 30 ఏళ్ల కబడ్డీ ఆటగాడు హత్యకు గురయ్యాడు. డానీ బాల్, లక్కీ పటియాల్ అనే ఇద్దరు గ్యాంగ్స్టర్లకు సంబంధించిన మనుషులు బాలచౌరియాను హత్య చేశారు. ఆదివారం సాయంత్రం మొహాలీలో ఓ టోర్నమెంట్లో ఆడుతున్న బాలచౌరియాను ఇద్దరు దుండగులు సెల్ఫీ పేరుతో పక్కకు పిలిచారు.
ఆ తర్వాత పాయింట్ బ్లాక్ రేంజ్లో అతడి తలపై, ముఖంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దాంతో బాలచౌరియా అక్కడికక్కడే కుప్పకూలాడు. అక్కడే ఉన్న యువ ఆటగాళ్లు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయారు. బాలచౌరియాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
కాగా బాలచౌరియాకు 15 రోజుల క్రితమే వివాహం జరిగింది. బాలచౌరియా హత్య జరిగిన కొన్ని గంటలకే గ్యాంగ్ స్టర్ డానీ బాల్.. ఆ హత్యకు బాధ్యులం తామేనని ప్రకటించాడు. తనతోపాటు పలువురు గ్యాంగ్స్టర్లం ప్లాన్ చేసి బాలచౌరియాను చంపేశామని తెలిపారు. బాలచౌరియా మా శత్రు గ్యాంగ్స్టర్లు అయిన జగ్గూ భగవాన్ పూరియా, లారెన్స్ బిష్ణోయ్‌లతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అందుకే అతడిని హతమార్చామని చెప్పారు.
కాగా మూడేళ్ల క్రితం జలంధర్ జిల్లాలో సందీప్ నంగాల్ అనే కబడ్డీ ప్లేయర్ కూడా ఇదేవిధంగా హత్యకు గురయ్యారు. గత అక్టోబర్‌లో జగ్రాన్ జిల్లాలో తేజా సింగ్ అనే 25 ఏళ్ల కబడ్డీ ప్లేయర్‌ను కూడా ఇదేవిధంగా హత్యచేశారు.