వెంగళరావునగర్ జూలై 19 : బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు నలుగురు వ్యక్తులు అదృశ్యమైన ఘటనలు నమోదవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ మేరకు బోరబండ పోలీసులు నాలుగు వేర్వేరు మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీజీ హాస్టల్ నుంచి యువకుడు అదృశ్యం
చింతల్ ద్వారకానగర్ కు చెందిన గంగాజీ అరవింద్ ఫిర్యాదు మేరకు ఆయన మేనల్లుడు సుమిత్ భరత్ లంకపురె(19)ఎర్రగడ్డలోని పద్మావతి మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి తన బ్యాగ్‌తో హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన అనంతరం తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. అతని సెల్‌ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదే నా చివరి సందేశం అంటూ భర్త అదృశ్యం
ఎర్రగడ్డ శంకర్‌లాల్ నగర్‌కు చెందిన ఎం.దినేష్ కుమార్(33) కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో వాగ్వాదానికి దిగిన అనంతరం ఇంటి నంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన భార్య ప్రసూనకు ఇదేనా చివరి సందేశం..నేను తిరిగి రాను అంటూ సెల్ ఫోన్‌కు సందేశం పంపినట్లు ఆమె పోలీసులు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళకు గురయ్యారు.
ఇంట్లో నుంచి యువతి కనపించకుండా పోవడం
ఈఎస్ఐ దవాఖానాలో హెల్పర్‌గా పనిచేస్తున్న షేక్ షోయబ్ ఫిర్యాదు మేరకు, ఆయన భార్య షేక్ జకీరా(19) ఈ నెల 17న ఇంటి నుంచి అదృశ్యమైంది. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న సమయంలో భార్య కనిపించకపోవడంతో బంధువులు,స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.
మానసికి దవాఖానా నుంచి చికిత్స పొందుతున్న వ్యక్తి పరార్
వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన అబ్బాని జగదీశ్వర్(28) ఎర్రగడ్డ మానసిక దవాఖానాలో చికితిస పొందుతున్నాడు. ఈ నెల 18వ తేదీ రాత్రి దవాఖాన నుంచి పారిపోయినట్లు ఆయన సోదరుడు వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దవాఖాన పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఈ నాలుగు ఘటనల పై బోరబండ పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసి అదృశ్యమైన వారి ఆచూకీ కోసం గలింపు చర్యలు చేపట్టారు.