ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కొన్నిసార్లు ఆ సమస్యలోనే తిరుగులేని పరిష్కారం దొరుకుతుంది. సిద్దిపేటలో జరుగుతున్నది అదే. డ్రైనేజీ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడానికి.. ‘రుతు ప్రేమ’ పేరుతో వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళల ఆరోగ్యం, పొదుపు, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన ఆలోచన ఇది.
సిద్దిపేట మున్సిపల్ సిబ్బంది నిత్యం ఇంటింటికీ వెళ్లి మూడు రకాల చెత్తలను సేకరిస్తారు. మొదటిది తడి చెత్త, రెండోది పొడిచెత్త. మూడోది మాత్రం.. హానికరమైన చెత్త. పట్టణ పాలక సంస్థకు ఇదో సవాలు. శానిటరీ ప్యాడ్లను బహిరంగంగా చెత్తపాలు చేయడానికి మహిళలు ఇబ్బంది పడతారు. చెత్త బండికి ఇవ్వకుండా డ్రైనేజీలో పడేస్తారు. అవన్నీ పేరుకుని మ్యాన్‌హోల్స్ మూసుకుపోతున్నాయి. ఈ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వందల ఏండ్లు పడుతుంది. పోనీ కాల్చేద్దామా అంటే పర్యావరణానికి మరింత ప్రమాదం. ఈ సమస్య పరిష్కారానికి నిపుణుల సలహా తీసుకోవాలని భావించారు మంత్రి హరీశ్‌రావు. బెంగళూరుకు చెందిన పర్యావరణ వేత్త డాక్టర్ శాంతి నేతృత్వంలోని బృందంతో లోతైన అధ్యయనం చేయించారు. పునర్వినియోగానికి అనువైన డైపర్లు, న్యాప్కిన్లు తయారు చేయడమే ఇందుకు సరైన పరిష్కారమని పర్యావరణ వేత్తలు సూచించారు. అలా, ‘రుతు ప్రేమ’ ప్రాణంపోసుకున్నది.
బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘రుతుప్రేమ’ అమలుకు ముందు కొచ్చింది. స్టోన్ సూప్ అనే స్వచ్ఛంద సంస్థ – సిద్దిపేట మున్సిపాలిటీ తమవంతు సహకారం అందిస్తున్నాయి. దీంతో ఓ ఉద్యమంలా.. వస్త్రంతో తయారు చేసిన ప్యాడ్లు, పిల్లల డైపర్లు, మెడికల్ గ్రేడ్ సిలికాన్ క్యాప్స్ సిద్దిపేట మహిళలకు పరిచయం చేస్తున్నారు. ఈ క్యాప్స్‌ను 8 నుంచి 10 ఏండ్ల వరకూ వాడొచ్చు. ఇవి సురక్షితం, ఆరోగ్యకరం కూడా. నెలనెలా ప్యాడ్స్ కొనాల్సిన అవసరమూ ఉండదు. అలా ప్రతి మహిళకూ ఏటా రూ.1200 వరకు ఆదా అవుతుంది. వీటి వాడకంపై ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు.
‘మారుతున్న కాలానికి అనుగుణంగా రుతుస్రావ సంబంధమైన అలవాట్లనూ మార్చుకోవాలి. క్లాత్ ప్యాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది’ అంటారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత. ‘మహిళల ఆరోగ్యం, డబ్బు, పర్యావరణ పరిరక్షణ, సౌకర్యం.. ఈ నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకొని రుతుప్రేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్లాస్టిక్, కెమికల్స్ కలిగిన ప్యాడ్స్ వల్ల మహిళల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా ప్రమాదమే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మెడికల్ గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేసిన శానిటరీ కప్‌లను పరిచయం చేస్తున్నాం’ అంటూ కార్యక్రమ లక్ష్యాన్ని వివరించారు డాక్టర్ శాంతి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం ‘రుతుప్రేమ’పై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
… కత్తుల శ్రీనివాస్‌రెడ్డి