Tooth Sensitivity | దంతాల సున్నితత్వం (టూత్ సెన్సిటివిటీ) చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. వేడి టీ, చల్లని ఐస్‌క్రీమ్ లేదా పుల్లని ఆహారం తీసుకున్నప్పుడు దంతాలలో ఒక్కసారిగా గుచ్చినట్టు నొప్పి అనిపించడం దీని ప్రధాన లక్షణం. దంతాలపై ఉండే ఎనామెల్ పొర దెబ్బతినడం వల్ల లోపలి డెంటిన్ బయటపడితే ఈ సమస్య ఏర్పడుతుంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ జర్నల్ ప్రకారం ప్రతి ఎనిమిది మంది పెద్దల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దంతాలను గట్టిగా లేదా ఎక్కువ ఒత్తిడితో బ్రష్ చేయడం, అధికంగా ఆమ్ల గుణాలు ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోవడం, దంతాలను రాత్రిపూట రుద్దకపోవడం, పాత ఫిల్లింగ్స్ దెబ్బతినడం, దంత క్షయం లేదా కొన్ని దంత చికిత్సల తర్వాత కూడా టూత్ సెన్సిటివిటీ కనిపిస్తుంది. టూత్ సెన్సిటివిటీ నుంచి ఉపశమనం పొందేందుకు ఉప్పునీరు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నోటిలో పీహెచ్ సమతుల్యతను కాపాడి హానికర బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. అంతేకాకుండా సహజ యాంటీ సెప్టిక్‌గా పనిచేసి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల ఉప్పు కలిపి రోజుకు రెండు సార్లు పుక్కిలించడం వల్ల సున్నితత్వం, నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.
జామ ఆకులు కూడా ఈ సమస్యకు సహజ పరిష్కారంగా ఉపయోగపడతాయి. వీటిలో క్వెర్సెటిన్, కాంఫెరాల్, రుటిన్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉండి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. రెండు నుంచి మూడు నిమిషాల పాటు కొన్ని జామ ఆకులను నమిలి ఉమ్మేయవచ్చు. లేదా నాలుగు నుంచి ఐదు ఆకులను నీటిలో మరిగించి కొద్దిగా ఉప్పు కలిపి మౌత్‌వాష్‌గా ఉపయోగించవచ్చు. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది సహజ నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది. రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా నీరు, అర టీ స్పూన్ ఉప్పుతో కలిపి పేస్ట్‌గా తయారు చేసి ప్రభావిత దంతంపై కొన్ని నిమిషాలు ఉంచాలి. అనంతరం గోరువెచ్చని ఉప్పునీటితో నోరు కడుక్కోవాలి. లవంగ నూనెను దంతాల నొప్పిని తగ్గించడంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే క్రిమినాశక, వాపు నిరోధక, నొప్పిని తగ్గించే గుణాలు దంతాల సున్నితత్వాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక చుక్క లవంగ నూనెను కొబ్బరి లేదా బాదం నూనెలో కలిపి ప్రభావిత ప్రాంతంలో రాయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ వాపును తగ్గించి నొప్పిని ఉపశమింపజేస్తుంది. అలాగే దీని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటిలోని హానికర బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. చిన్న ఉల్లిపాయ ముక్కను ప్రభావిత ప్రాంతంలో ఐదు నిమిషాల పాటు ఉంచి, తర్వాత ఉప్పునీటితో నోరు కడుక్కోవడం మంచిది. అయితే ఈ సహజ చిట్కాలు తాత్కాలిక ఉపశమనం ఇవ్వగలిగినా, నొప్పి ఎక్కువకాలం కొనసాగితే లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా దంత వైద్యుడిని సంప్రదించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.