హోస్టన్: ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నాకౌట్‌కు అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ఆదివారం జరిగిన గ్రూపు-ఎఫ్ పోరులో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్‌పై ఘన విజయం సాధించింది. తమ తొలి పోరును జపాన్‌తో 2-2తో డ్రా చేసుకున్న నెదర్లాండ్స్..మలి పోరులో విశ్వరూపం ప్రదర్శించింది. స్వీడన్‌పై భారీ విజయంతో గ్రూపులో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకెళుతున్నది. స్వీడన్‌పై పోరులో అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన నెదర్లాండ్స్ టీమ్‌లో బ్రియాన్ బ్రాబె(5ని, 17ని), క్యాడె గప్కో(47ని, 54ని) డబుల్ గోల్స్‌తో విజృంభించగా, క్రిసెన్సియో సమర్విల్లె(89ని) మరో గోల్‌తో ఆకట్టుకున్నాడు. అంథోని ఎలంగ(59ని) స్వీడన్‌కు ఏకైక గోల్ అందించాడు. తమ తొలి పోరులో ట్యునీషియాను 5-1తో ఓడించిన స్వీడన్..నెదర్లాండ్స్‌పై పూర్తిగా తేలిపోయింది.
1950 ప్రపంచకప్‌లో బ్రెజిల్ చేతిలో 7-1 ఓటమి తర్వాత స్వీడన్‌కు ఇదే భారీ పరాజయం కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే ..పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన డచ్ టీమ్ స్వీడన్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ ఐదవ నిమిషంలోనే బ్రియాన్ గోల్‌తో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. స్వీడన్ డిఫెన్స్‌ను కంగుతినిపిస్తూ గప్కో..పెనాల్టీ ఏరియాలో అందించిన బంతిని బ్రియాన్ అద్భుత రీతిలో గోల్‌గా మలిచాడు. అదే ఊపు కొనసాగిస్తూ 12 నిమిషాల వ్యవధిలో బ్రియాన్ మరో గోల్‌తో విరుచుకుపడ్డాడు. డమ్ఫైర్స్ బంతిని అందుకున్న బ్రియాన్..అదే వేగంతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో డచ్ ఆధిక్యం 2-0కు చేరుకుంది. కీలకమైన ద్వితీయార్ధంలోనూ డచ్ దూకుడును ఎక్కడా తగ్గించలేదు.
మ్యాచ్ మొదలైన రెండో నిమిషానికే గప్కో గోల్‌తో ఆధిక్యం 3-0కు చేరుకోగా, ఏడు నిమిషాల తేడాతో మరో గోల్‌తో చెలరేగడంతో డచ్‌కు తిరుగులేకుండాపోయింది. అప్పటికే మ్యాచ్ పట్టు కోల్పోయిన స్వీడన్‌కు ఎలంగ గోల్ ఒకింత ఊరటనిచ్చింది. మ్యాచ్ ఆఖరి క్షణాల్లో గోల్ చేసిన సమర్విల్లె..ఎన్బీఏ స్టార్ స్టెప్ కర్రీ ‘నైట్ నైట్’ అభివాదంతో ఫ్యాన్స్‌ను అలరించాడు. 68,777 మంది ప్రేక్షకులు హాజరైన ఈ మ్యాచ్‌ను డచ్ కింగ్ విలియమ్ అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్యునీషియాతో మ్యాచ్‌లో జపాన్ 4-0తో ఘన విజయం సాధించింది. అయాసె యుడా(31ని, 83ని) డబుల్ గోల్‌తో చెలరేగగా, దైచీ కమాడ(4ని), జున్య ఇటో(69ని) ఒక్కో గోల్ చేశారు.
న్యూజిలాండ్ x ఈజిప్ట్
ఉ. 6.30 నుంచి
అర్జెంటీనా x ఆస్ట్రియా
రా. 10.30 నుంచి
ఫ్రాన్స్ x ఇరాక్
తె.జా 2.30 నుంచి