అహ్మదాబాద్, సెప్టెంబర్ 22: మోదీ పుట్టిన రోజు నాడు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారన్న ఆరోపణపై బీజేపీ పాలిత గుజరాత్లో 21 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పెద్దయెత్తున దీపాలను వెలిగించి ‘ఆశీర్వాద దీపం’ వంటి కార్యక్రమాన్ని భారీయెత్తున నిర్వహించారు. అయితే గుజరాత్‌లోని మోర్బీ జిల్లా జెట్పార్లో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, రాష్ట్రంలో అదానీ పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
కాగా, విద్యుత్తు ప్రసార లైన్లు, టవర్లకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ పుట్టిన రోజు రావడంతో ఆ రోజు జెట్పార్లో ఈ నిరసన జరిగింది. అదానీ ప్రాజెక్టు వల్ల తాము అత్యంత తీవ్రంగా ప్రభావితమవుతున్నట్టు మోర్బీ జిల్లా రైతులు ఆరోపించారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనం బీజేపీ పాలకులకు ఆగ్రహం కలిగించింది. ఈ ఘటనపై మోర్బీ పోలీస్ స్టేషన్లో 21 మంది రైతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజా రహదారిపై మండే ద్రవాన్ని చల్లి నిప్పు అంటించడానికి కుట్ర పన్నడమే కాక, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని వారిపై అభియోగాలు నమోదు చేశారు.
21 మంది కాదు.. 21 వేల మంది జైలుకు వెళ్తాం
రైతులను అణచివేయడానికి గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని అన్నదాతలు ఆరోపించారు. ప్రభుత్వం కేవలం 21 మంది మీద మాత్రమే కేసులు నమోదు చేసిందని, కానీ 21 వేల మంది రైతులు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు. తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం శాంతియుత నిరసన హక్కును కాలరాయడమేనని ఆరోపించారు. కాగా, మోర్బి బీజేపీ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న కాంతీభాయ్ అమృతీయ సోదరులైన కరాభాయ్ అమృతీయ, భరత్‌భాయ్ అమృతీయలు రైతుల ఉద్యమానికి మద్దతు పలకడం గమనార్హం. రైతులను వేధించడానికే వారిపై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఈ సోదరులు ఆరోపించారు.
హర్యానాలో రైతులపై లాఠీచార్జి
కురుక్షేత్ర, సెప్టెంబర్ 22: వరి కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ హర్యానాలోని కురుక్షేత్రలో రైతులు నిర్వహించిన భారీ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సెప్టెంబర్ 20 వచ్చినా తమ వద్ద నుంచి ప్రభుత్వం ధాన్యం సేకరించడం లేదని, ఆలస్యం చేయకుండా వరిని కొనాలన్న డిమాండ్‌తో రైతులు షాహాబాద్‌లో అంబాలా-న్యూఢిల్లీ 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఆందోళనకు దిగారు.
రోడ్డును దిగ్బంధించడంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు రైతులపై లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్‌ను ప్రయోగించి చెదరగొట్టి రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. రైతుల ఆందోళనతో కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది. తర్వాత రైతు నేతలను అధికారులు చర్చలకు పిలిచారు. అయితే అధికారుల నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదు. కాగా, ధాన్యం కొనుగోలు చేయాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించారని రైతునేత గుర్నామ్ చధుని ఆరోపించారు. రైతుల ఆందోళనకు షాహాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్‌కరణ్ కాలా మద్దతు ప్రకటించారు.