హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాలన్ ఇన్వాయిస్ డిసౌంటింగ్ డిపాజిట్ల కేసులో తెలంగాణ సీఐడీ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ‘వరల్డ్ లైన్’ ఈ-పేమెంట్ గేట్‌వే సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ షేక్ మొహిద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
అనధికారికంగా డిపాజిట్లు వసూలు చేయడంతోపాటు మోసానికి, నమ్మకద్రోహానికి, క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మొహిద్దీన్ అరెస్టు జరిగింది. రూ.4,215 కోట్ల ‘ఫాల్కన్’ కుంభకోణంలో 7 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. ‘వరల్డ్ లైన్’ ఈ-పేమెంట్ గేట్‌వే సేవలను నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి తనిఖీలు లేకుండా మోసపూరిత యాప్‌నకు అందజేయడం ద్వారా ప్రజల నుంచి సులభంగా కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసేందుకు వీలుకల్పించినట్టు మొహిద్దీన్‌పై ఆరోపణలున్నాయి. ఈ అక్రమాల ద్వారా ‘వరల్డ్ లైన్’ సంస్థ సుమారు రూ.7.53 కోట్లు ఆర్జించినట్టు అధికారులు గుర్తించారు.