ఏటూరునాగారం, జూన్ 28: ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ విత్తన మాఫియా పంజా విసురుతోంది. అమాయకత్వమే ఆసరగా చేసుకొని కొన్ని విత్తన కంపెనీల ప్రతినిధులు మాయమాటలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కవ దిగుబడి వస్తుందంటూ నమ్మబలికి అంటగుడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి మోసపోయామని తెలుసుకొన్న అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో నకిలీ విత్తనాలతో తస్మాత్ జాగ్రత్త అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
విత్తన కంపెనీ ప్రతినిధులు తొలుత వరి సాగు చేసే రైతులను సంప్రదించి దిగుబడి మొత్తం తామే తీసుకుంటామని అగ్రిమెంట్ చేసుకుంటుండడంతో వారి మాయలో పడిన కొందరు అన్నదాతలు అంగీకరించి సాగు చేస్తున్నారు. తీరా పంట సరిగా రాకపోవడంతో పంచాయితీ పెట్టుకోవాల్సి వస్తున్నది. రబీ సీజన్లో పలు గ్రామాల్లో రైతులు మేల్ ఫిమేల్ వరి సాగు చేసి పంట దిగుబడి రాకపోవడంతో నష్టపోయారు. ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి, నకిలీ విత్తనాల కారణంగా ఆరు, ఏడు బస్తాలు మాత్రమే వచ్చినట్లు పలువురు రైతులు కంపెనీ ప్రతినిధుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
చూడటానికి వరి పంట ఏపుగా కన్పించినా కంకులు మాత్రం లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. నష్టపోయిన వారికి విత్తన కంపెనీ ప్రతినిధులు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి తీరా ఏబీసీగా విభజించి చెల్లిస్తునారు. ఈ క్రమంలో ఏమి చేయలేని పరిస్థితిలో రైతులు ఈ విధానానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా మక్కజొన్న బాండ్ పేరుతో వచ్చే కంపెనీలు కూడా రైతులను మోసం చేస్తున్నాయి. ఏజెన్సీలోని పలు గ్రామాల్లో మక్కజొన్న సాగు చేసిన వారు నష్టపోగా కొన్ని కంపెనీలు పట్టించుకోనట్లు సమాచారం. మేల్ ఫిమేల్ విత్తనాలు ఏ భూమిలో దిగుబడి వస్తుందో, ఎక్కడ రాదో అనే విషయం స్పష్టం చేయకపోవడంతో కొందరు సాగు చేసేందుకు ముందుకు వచ్చి నష్టపోతున్నారు.
అంతే కాకుండా ఎలాంటి వాతావరణంలో ఈ పంటలు సాగు చేయవచ్చనే విషయాన్ని స్పష్టం చేయకుండా కంపెనీ ప్రతినిధులు తమకు విత్తనాలను అంటగడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ గ్రామంలో విత్తనాలు, దిగుబడి విషయంలో రైతులు, కంపెనీ ప్రతినిధుల మధ్య నష్టపరిహారం విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, సీడ్ కంపెనీలు మాత్రం గ్రామాల్లో తిరుగుతూ విత్తన దుకాణాల యాజమానులకు ప్రోత్సహకాలు అందిస్తూ అంటగడుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి తాము సాగుచేస్తున్న పంటలపై దృష్టి సారించాలని పలువురు రైతులు కోరుతున్నారు.