హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : బీబీఏ, బీసీఏ కోర్సులకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా ఎంట్రెన్స్ నిర్వహించి ఈ కోర్సుల్లోని సీట్లు భర్తీచేయనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కాకుండా.. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(బీఎంఎస్) కోర్సులను కొన్ని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్నారు.
ఇవి కన్వెన్షనల్ డిగ్రీ కోర్సులు కావడంతో ఇన్నాళ్లు ఇంటర్ మెరిట్ ఆధారంగా దోస్త్ ద్వారా ఈ సీట్లను భర్తీచేస్తున్నారు. ఈ మూడు కోర్సులకు ఇంతవరకు వర్సిటీలు అనుమతులిచ్చేవి.. కానీ తమ నుంచి అనుమతి పొందాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2025లో వెల్లడించింది. ఏఐసీటీఈ అనుమతి పొందే విషయంలో మూడేండ్ల సడలింపును రాష్ట్రం కోరింది.
ఈ విద్యాసంవత్సరంతో ఈ గడువు ముగియనున్నది. మహారాష్ట్ర ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నది. ఇదే తరహాలో 2027-28 విద్యాసంవత్సరం నుంచి ఈ మూడు కోర్సుల్లోని సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డిగ్రీ ఇంజినీరింగ్ కాలేజీల్లోని సీట్లను ఎంట్రెన్స్తో భర్తీచేసే ఆలోచనలో ఉన్నారు.