హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబరేటరీ(డీఎల్ఆర్ఎల్) సన్నద్ధం కావాలని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి తెలిపారు. డీఎల్ఆర్ఎల్ గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకొని శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన సాంకేతికతలను రూపొందిస్తున్నారని డీఎల్ఆర్ఎల్ సిబ్బందిని అభినందించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలను భాగస్వాములను చేస్తే ఈ రంగంలో వృద్ధి వేగం పెరుగుతుందని తెలిపారు. గౌరవ అతిథి డీఆర్డీవో డీజీ మంజుల మాట్లాడుతూ కరోనా కట్టడికి పలు రకాల ఉత్పత్తులను తయారుచేసి డీఎల్ఆర్ఎల్ కీలకపాత్ర పోషించిందని కొనియాడారు. అనంతరం డీఎల్ఆర్ఎల్ ఆరు దశాబ్దాల చరిత్రపై సావనీర్, కాఫీటేబుల్ బుక్‌ను సతీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డీజీ డాక్టర్ బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి, డీఎల్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ కే మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.