హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు చేపల పెంపకం, పశు సంపదపై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో వర్షపాతం సాధారణం కంటే 16%తక్కువ నమోదైంది. దీంతో ఈ ఏడాది రబీలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు, తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రతికూల వాతావరణం వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు పాడి, మాంసం కోసం పెంచే పశువుల ఆరోగ్యం, ఉత్పాదకతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నివారణ చర్యలు సూచించారు. ఎల్ నినో కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో కార్టిసోల్, ఏసీటీహెచ్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడులవుతాయి. ఈ హార్మోన్లు పశువుల రోగనిరోధక శక్తిని అణచివేస్తాయి. వేడి, తేమతో కూడిన వాతావరణం వల్ల పేలు, గోమార్లు, ఈగలు ఎకువగా వృద్ధి చెంది పశువులకు వ్యాధులను వ్యాపింపజేస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల గొంతువాపు, జబ్బవాపు, ఆంత్రాక్స్ లాంటి ప్రమాదకరమైన బాక్టీరియా, వైరల్ వ్యాధులు వేగంగా సోకుతాయి. ఆవులు తమ శరీరంలో వేడిని తగ్గించుకునే క్రమంలో జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల దాణా తీసుకోవడం తగ్గిపోతుంది.
తగినంత దాణా తీసుకోకపోవడం వల్ల పాల దిగుబడి 10% నుంచి 30% వరకు పడిపోతుంది. సరైన పశుగ్రాసం లేకపోవడం వల్ల పశువుల బరువు పెరుగడం ఆగిపోతుంది. తీవ్రమైన ఎండల వల్ల పశువుల కండరాల్లో నిల్వ ఉండే గె్లైకోజెన్ శక్తి పూర్తిగా హరించుకుపోతుంది. దీనివల్ల మాంసం కోసే సమయానికి దాని ఆమ్ల-క్షార స్థాయి 5.8-6.0కు పెరిగిపోయి, మాంసం ముదురు రంగులో, గట్టిగా, పొడిగా మారుతుంది. దీనివల్ల మారెట్లో మాంసం నాణ్యత, ధర పడిపోతుంది. ఎల్ నినో వల్ల వర్షపాతం తగ్గడంతో పచ్చగడ్డి దిగుబడి ఆగిపోయి పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే 4.5 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడిందని పశువైద్యులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల పశువులకు తాగునీటి కొరత ఏర్పడుతుంది.
నివారణ చర్యలు : ప్రభుత్వం పశు సంరక్షణకు అవసరమైన ముందస్తు ప్రణాళిక రూపొందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రాబోయే కరువు పరిస్థితులను(ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు) దృష్టిలో ఉంచుకొని పశుగ్రాసం ప్రణాళిక అవసరం.పచ్చగడ్డి అందుబాటులో లేకపోతే ఎండు గడ్డికి పోషకాలు కలిపి ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచించారు. మేతలో పీచు పదార్థాలతోపాటు శక్తిని ఇచ్చే దాణా పెంచాలి. అజీర్తి సమస్యలు రాకుండా ప్రోబయోటిక్స్ వాడాలి. వడదెబ్బను, డీహైడ్రేషన్‌ను తట్టుకోవడానికి తాగునీటిలో ఎలక్ట్రోలైట్లు కలపాలి.
పశువులకు మినరల్ మిక్చర్, ఉప్పు ఎకువగా ఉండే దాణా అందించాలి. గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు తాగించాలి. పాకల్లోకి పేలు, గోమార్లు రాకుండా పాత మట్టిని తీసేసి కొత్త మట్టి వేయాలి, క్రిమిసంహారకాలు పిచికారీ చేయాలి. పాకల్లో రద్దీని తగ్గించాలి. రద్దీ వల్ల వేడి పెరుగడమే కాకుండా అమ్మోనియా వాయువు ఉత్పత్తి అయి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. సూక్ష్మస్థాయిలో ప్రణాళికాబద్ధంగా పాటిస్తే, ఎల్ నినో లాంటి విపతర వాతావరణ పరిస్థితులు, పశుగ్రాసం కొరతను అధిగమించి, పశువుల ఉత్పాదకత పడిపోకుండా కాపాడుకోవచ్చని పశువైద్య శాస్త్రవేత్తలు సూచించారు.