ఉత్తర హిమవన్నగ శిఖరంపై దూకే
ఉత్తుంగ గంగా తరంగంలా
ఉప్పొంగే భావనా ఝరిని నేను!
పలుపంటల సిరిని నేను!
‘ధర్మో రక్షతి రక్షితః’ అని ప్రబోధించే
ధార్మిక సూత్రాన్ని నేను!
కాలాగ్ని నేత్రాన్ని నేను!
అమర సమర కురుక్షేత్రాన్ని నేను!
‘కింకర్తవ్యతా’ మూఢుడైన కౌంతేయునికి
కర్తవ్యోపదేశం చేసిన ‘గీతా’న్ని నేను!
ధ్యానముద్రలో బడసిన
గౌతముని జ్ఞానోదయాన్ని నేను!
ఆదిశంకరుని ఆధ్యాత్మిక
మహోదయాన్ని నేను!
పరాయి దండయాత్రల్ని ప్రతిఘటించి
పలాయనం గావించిన
పురుషోత్తమ పౌరుషాన్ని నేను!
చంద్రగుప్తుని శౌర్యాన్ని నేను!
కాళిదాసు కావ్యాన్ని నేను
కవిత్రయ భారతాన్ని నేను!
పోతన్న భాగవతాన్ని నేను!
మొఘల్ చక్రవర్తుల్ని
మొనగాళ్లలా ఢీకొన్న
రాణాప్రతాప ధైర్య ప్రతాపాన్ని నేను!
శివాజీ సాహసాన్ని నేను
శాతవాహన గాథల్ని నేను
కాకతీయ కవచాన్ని నేను
విజయనగర విభవాన్ని నేను
గోల్కొండ ప్రాభవాన్ని నేను!
తాన్సేన్ గానాన్ని నేను!
త్యాగయ్య రాగాన్ని నేను!
ఆంగ్లేయ వలస పాలకుల అరాచకాల్ని
ఆగ్రహంతో ఎదిరించిన
సిపాయిల విప్లవాన్ని నేను!
ఝాన్సీ ఖడ్గాన్ని నేను!
దారుణ మారణ హోమాల్ని
దండి సత్యాగ్రహాలతో నిరసించి
అహింసా సిద్ధాంతంతో ఎదిరించి
దేశ దాస్య శృంఖలాల్ని తెంచిన
మహాత్ముని మార్గాన్ని నేను!
సువర్ణ స్వతంత్ర వీచికల ఎగిరే
త్రివర్ణ పతాకాన్ని నేను!
వివేకానందుని విశ్వ ప్రసంగాన్ని నేను!
విశ్వకవి భావనా విహంగాన్ని నేను!
వికృత విస్ఫోటనాల్ని అణగార్చే
విశ్వశాంతి విజ్ఞానాన్ని నేను!
గ్రహాంతర స్థితి గతుల్ని శోధించి సాధించే
సాంకేతిక ‘శాటిలైట్’ పరిజ్ఞానాన్ని నేను!
అయినా..
పొలిమేరలో పొంచివున్న ముప్పుల్ని
సొంత గూటి చాటు మాటు తప్పుల్ని
పాశవిక శక్తుల్ని పసిగట్టలేని అశక్తున్ని!
అవినీతి కూపంలో
అత్యాచార పాపంలో
పదే పదే పడిపోతున్న వర్తమానాన్ని!
అంతకంతకూ జాతిలో
నీతీ నిజాయితీ అడుగంటుతున్న కథనాన్ని!
శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా
శతాంశమైనా తగ్గని స్వార్థ సారాన్ని,
తిమిర తీరాన్ని!
ఈ తీరం దాటాలంటే..
అనుదిన ఘోరం అణగారాలంటే
ప్రతి పౌరుడు బాధ్యతగా ప్రవర్తించాలి!
సక్రమంగా విధుల్ని నిర్వహించాలి!
పీల్చే యీ గాలిని
తాగే యీ నీటిని
అనుభవించే ఆహారాన్ని
నివసించే యీ నేలని
దైవంగా భావించాలి!
కన్నతల్లిలా సేవించాలి!
అంతఃకలహాల్ని అణచాలి!
విదేశ విద్రోహాల్ని కూల్చాలి!
నీడనిచ్చి పోషిస్తున్న చెట్టుకే
చీడపురుగులా మారక
శంకలన్ని తొలగేలా
విజయ శంఖం పూరించాలి!
విశ్వ ప్రగతి సాధించాలి!
నవీన భారతాన్ని
నయనానందంగా తీర్చాలి!
స్వాతంత్య్ర భారతాన్ని
సస్యశ్యామలంగా మార్చాలి!
స్వాతంత్య్ర అమృతోత్సవాన్ని
ఆనంద తీరాలకు చేర్చాలి!
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ
92465 41699