కనులు తెరువని లోకపు వాకిలిలో
వెలుతురు పరిచిన కర్మ జీవిని నేను
అంతా పిడికెడు మట్టయిన మనుషుల్ని
సారవంతం చేసిన చెమట చెలిమెను నేను
సకల ఉత్పత్తి చలనాల సవ్వడిలో..
ఊపిరిపాటై పోటెత్తుతున్నది నేనే
ఆకలిని అశాశ్వతం చేసే క్రతువులో
సమిధనై కాలుతున్న కష్టజీవినీ నేనే
నా దేహాన్ని కొలిమిని చేసి
లోహాలను పలు ఆకారాలుగా మార్చి
మానవ మనుగడకు మార్గం చూపిన
తొలి అడుగును నేను
కొండలను పిండి చేసి కొత్త దారులు వేసి
అడవులను చదును చేసి
అన్నపు రాసులుగా పేర్చి
నదుల నడకలు మార్చి నవ నాగరికతను నేర్పి
జగతి గతికి మూలమైన ప్రగతిరథ చక్రాన్ని నేను
నా జ్ఞాన చక్షువులతో
సమాజ సంక్షేమాన్ని రూపుదిద్దుతున్న
దార్శనికున్ని నేను
నీ ఆకృతి రూపశిల్పిని నేను
అణువణువు రుణపడిన ఆదిమ జంగమ నేను
చావు పుట్టుకల సయ్యాటలో
ఆది నుంచి అంతం దాకా
అడుగడుగునా అల్లుకున్న
సమస్త సేవల సారం నేనే
ఉత్పత్తికి ఊతమైన కులాల కూటమిలో
అర్ధభాగం నేనే అయినా…
అభివృద్ధి వాటాల నిష్పత్తిలో
నీ పంపకాల లెక్కలు ఎప్పుడూ
తప్పుతూనే ఉన్నాయి.
నా దింపుడు కళ్ళం ఆశ
అడుగంటుతూనే ఉన్నది.
అందుకే ఇప్పుడు
అడుక్కునే ఆపసోపాల ఆటలను ఆపి
నాది నేను లాక్కొనే వేటను ఆరంభిస్తాను
నా కంటి పాప విశాలమవుతున్నది
ఇంతకాలం ఇసిరెలు మోసిన చేతులే
ఇప్పుడు రాజదండాన్నందుకొనే
ఇకమతులతో ఏకమవుతున్నవి
ఇది ప్రభంజనం..
ఝంఝా మారుత జన ప్రళయం