Darshanam Mogilaiah | పద్మశ్రీ అవార్డు గ్రహీత, మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు ఎదురైన పరాభవంపై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఒక ఫ్లైఓవర్ పిల్లర్‌పై గౌరవార్థం గీసిన మొగిలయ్య చిత్రపటంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాజకీయ పోస్టర్లతో పాటు, సినిమా వేడుకలకు సంబంధించిన పోస్టర్లను అంటించారు. అయితే తన ముఖంపై అంటించిన ఆ పోస్టర్లను చూసి కలత చెందిన మొగిలయ్య స్వయంగా తానే వాటిని తొలగిస్తున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఈ ఘటనపై వేణు ఉడుగుల స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి, సమాజానికి కొన్ని ఘాటు ప్రశ్నలు సంధించారు. “ఒక పద్మశ్రీ గ్రహీత ముఖం కూడా మనలో కొందరికి ఖాళీ గోడలా కనిపిస్తోందంటే, అది కేవలం ఆయనకు జరిగిన అవమానం మాత్రమే కాదు.. మన సాంస్కృతిక చైతన్యం (Cultural Consciousness) ఎక్కడో బలహీనపడుతోందని చెప్పడానికి ఇది ఒక నిశ్శబ్ద సంకేతం” అని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. మొగిలయ్య గారు తన బొమ్మపై అంటించిన పోస్టర్లను తానే స్వయంగా తొలగించుకోవాల్సి రావడం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఈ ఘటన ఎవరినో నిందించడానికి కాదని, ఇది మనందరిలో ఉన్న నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని వేణు ఉడుగుల అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (@TelanganaCMO), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (@TelanganaCS) మరియు జీహెచ్ఎంసీ (@GHMCOnline) అధికారులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరోవైపు తమ కళతో తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మొగిలయ్య లాంటి కళాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కళాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పద్మశ్రీ పొందిన ముఖం కూడా మనలో కొందరికి
ఖాళీ గోడలా కనిపిస్తే, ఇది అవమానం కాదు.
మన cultural consciousness ఎక్కడో బలహీనపడుతోందని చెప్పే నిశ్శబ్ద సంకేతం.
మొగిలయ్య గారు తన బొమ్మపై అంటించిన పోస్టర్లను తానే తొలగించుకుంటున్న ఆ సందర్భం
చాలా విచారకరం. నిజానికి ఇది ఎవరి మీద ఆరోపణ కాదు.… pic.twitter.com/eCnJ8Jz9xb— v e n u u d u g u l a (@venuudugulafilm) December 17, 2025