నందిపేట్, జూన్ 15 : రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నందిపేట్ మండల కేంద్రంలో రైతులు చేపట్టిన భారీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతికత పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ రైతులకు ఉపయోగం కన్నా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు, స్మార్ట్ ఫోన్లు లేని రైతుల పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. యాప్‌తో యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
వ్యవసాయాన్ని సులభతరం చేయాల్సిన ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలతో రైతులపై అదనపు భారాన్ని మోపుతున్నదని విమర్శించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందక పంటలు దెబ్బ తింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా యాప్ కారణంగా బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉన్నదని, ఫలితంగా ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. పాత పద్ధతిలోనే నేరుగా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని, లేనిపక్షంలో రైతాంగంతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భీమ్‌గల్, జూన్ 15 : రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని, యూరియాను విరివిగా అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. భీమ్‌గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి కొత్త నిబంధనలతో వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. సుమారు గంటన్నరపాటు రాస్తారోకో చేపట్టడంతో ఎస్సై సీహెచ్ తిరుపతి, ఏవో లావణ్య, తహసీల్దార్ కిరణ్‌కుమార్ వచ్చి బలవంతంగా ఆందోళనను విరమింపజేశారు.