న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబోయే ఆసియా గేమ్స్ కోసం ఈ నెల 30, 31వ తేదీల్లో జరిగే సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆమె పాల్గొనవచ్చా లేదా అనే అంశంపై తామే స్వయంగా ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ బరువు పెరిగిన కారణంగా అనర్హతకు గురవ్వడాన్ని జాతీయ అవమానం అని పేర్కొంటూ ఫెడరేషన్ ఈ నెల మొదట్లో ఆమెకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఆమె ఒలింపిక్స్ ఫైనల్స్ వరకు చేరింది. ఆ సమయంలో దేశప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో మీకు తెలియదా? దానిని జాతీయ అవమానంగా ఎలా చిత్రీకరిస్తారు? దేశంలో రెజ్లింగ్‌కు మీరు ఇలాగేనా సేవ చేసేది?’ అని ఆక్షేపించింది.
ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి రింగ్‌లోకి రావాలని చూస్తున్న తనను అడ్డుకునే ఉద్దేశంతోనే ఎంపిక చేసిన టోర్నమెంట్లలో పతకాలు నెగ్గిన వారిని మాత్రమే ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్‌కు అనుమతించాలని డబ్ల్యూఎఫ్ఐ తీసుకుందని వినేశ్ తన పిటిషన్లో పేర్కొంది. దాంతో తల్లి అయినందుకు ఆమెను శిక్షించకూడదని ధర్మాసనం పేర్కొంది. మన దేశంలో మాతృత్వాన్ని వేడుకగా జరుపుకుంటారని, ఫెడరేషన్ మాత్రం ప్రతీకారంతో వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. ‘వినేశ్ ఫొగాట్ గతేడాది జూలైలో తల్లి అయింది, ఇప్పుడు మే నెల నడుస్తోంది. ఆమె కోసమే ఫెడరేషన్ నిబంధనలను మార్చిందని ఎందుకు భావించకూడదు’ అని ప్రశ్నించింది.