సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : సాఫ్ట్వేర్ రంగంలో కొనసాగుతున్న నయా ట్రెండ్‌కు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఉన్నత విద్యా రంగంలోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంజినీరింగ్‌లో డేటా కోర్సు పూర్తి చేసిన యువతకు పెద్ద మొత్తంలో కొలువులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా మానవ వనరులను సిద్ధం చేయడంపై ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. అన్ని యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ డేటాసైన్స్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఏడాదిలోనే ఈ కోర్సుకు భలే డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది దోస్త్-20 కౌన్సెలింగ్ ద్వారా దాదాపు 6 వేల వరకు సీట్లు నిండాయి.
ఈ ఏడాది దోస్త్-21లో ఇప్పటి వరకు 8,000 వరకు సీట్లు నిండినట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు చెప్పుతున్నారు. రానున్న రోజుల్లో బీఎస్సీ డేటాసైన్స్ అధిక డిమాండ్ ఉంటుందని, అందుకోసం డిగ్రీ కాలేజీలలో సీట్ల సంఖ్య కూడా పెంచుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కూడా బీఎస్సీ కోర్సులో సీట్లు తగ్గించుకుని వాటిని డేటాసైన్స్‌కు మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు 120 కాలేజీలలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బీఎస్సీ డేటా సైన్స్ కమిటీ సభ్యులు ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రమ్ తెలిపారు.
టీసీఎస్‌తో ఒప్పందం..
బీఎస్సీ డేటాసైన్స్ విద్యార్థులకు, ఈ కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చిన డిగ్రీ, పీజీ కాలేజీలకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అవసరమైన విధంగా సాంకేతిక సహకారాలు అందించడానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఆధ్వర్యంలో టీసీఎస్ పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నారు. విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు, మినీ ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్టులకు సహకారం అందించడం, వారికి ఇంటర్నెషిప్లు నిర్వహించడం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడం వంటి అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 120 పైగా కాలేజీలలో బీఎస్సీతో పాటు బీఎస్సీ డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చారు.
ఈ కాలేజీలలో గత ఏడాదిలో 6 వేలకు పైగా.. ఈ ఏడాదిలో 8 వేలకు పైగా సీట్లు భర్తీ అయ్యాయి. రానున్న రోజులలో 20 వేలకు పైగా సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొనసాగింపుగా ఎంఎస్సీ డేటాసైన్స్ కోర్సును కూడా అన్ని యూనివర్సిటీ పరిధిలో అందించబోతున్నారు. అందుకు సంబంధించిన సిలబస్ కూడా రూపుదిద్దుకుంటుంది. సాఫ్ట్వేర్ సంస్థల భాగస్వామ్యం, మార్కెట్ పరిస్థితులు, ఉద్యోగం గ్యారంటీ వంటి అన్ని రకాల పరిస్థితులను అంచనా వేసి ప్రొఫెసర్ రామచంద్రమ్ ఆధ్వర్యంలో సిలబస్‌ను రూపుదిద్దుకుంది. ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురావడం రెండో సంవత్సరం కావడంతో దీనిని ఢిల్లీలోని పలు యూనివర్సిటీలతో పాటు, ఏపీ, ఇతర రాష్ర్టాలకు చెందిన ఉన్నత విద్యా మండళ్లు ఇక్కడి సిలబస్‌ను స్వీకరిస్తున్నారు.
జాబ్ గ్యారంటీ..
భవిష్యత్‌లో డేటా సైన్స్, బిగ్‌డాటా సైన్స్ కోర్సులు పూర్తి చేసిన యువతకు తప్పనిసరిగా ఉద్యోగాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలోని అన్ని విభాగాలకు డేటాసైన్స్ వారు కావాల్సి ఉంది. అందుకని డేటాసైన్స్ విద్యార్థులు ఉద్యోగాల విషయంలో ఎలాంటి బెంగపడాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ రామచంద్రమ్ భరోసా ఇస్తున్నారు. దేశ, విదేశాలలో ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారి ఈ కోర్సులో ప్రవేశాలు తీసుకోవడానికి ఈ నెల 20 వరకు దోస్త్ ద్వారా అవకాశం ఉంది.