e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News కొవిడ్‌ టెస్టులు పెంచండి..

కొవిడ్‌ టెస్టులు పెంచండి..

  • ఆర్టీ పీసీఆర్‌, ర్యాట్‌ నుంచి ఒమిక్రాన్‌ తప్పించుకోలేదు
  • ‘టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీటింగ్‌, వ్యాక్సినేటింగ్‌’.. ఇవే రక్ష
  • రాష్ర్టాలు, యూటీలకు కేంద్రప్రభుత్వం కీలక సూచనలు
  • దేశంలోకి కొత్త వేరియంట్‌ ప్రవేశించలేదన్న కేంద్రమంత్రి
  • దక్షిణాఫ్రికా కంటే ముందే నెదర్లాండ్స్‌లో ఒమిక్రాన్‌

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఆర్టీ-పీసీఆర్‌, ర్యాట్‌ (యాంటీజెన్‌) టెస్టుల నుంచి తప్పించుకోలేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి, టెస్టుల సంఖ్యను పెంచాలని, అలాగే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘాను పటిష్టం చేయాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వాలు, యూటీల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించారు. వాయు, జల, భూ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిపైనే కాకుండా కేసులు ఎక్కువగా నమోదవుతున్న హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగిరం చేయాలని సూచించారు. ‘ఎట్‌ రిస్క్‌’ జాబితా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు తొలిరోజుతో పాటు ఎనిమిదో రోజు కూడా టెస్టులను తప్పనిసరిగా చేయాలన్నారు. ఆర్టీ-పీసీఆర్‌ టెస్టు ఫలితం వచ్చేవరకూ ఈ ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే ఉండాలన్నారు. ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలు, వెంటిలేటర్లు, పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేటింగ్‌ ప్లాంట్లు వంటి వైద్య సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీటింగ్‌, వ్యాక్సినేటింగ్‌ సూత్రాలను పాటించాలన్నారు. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను ప్రతీ గడపకూ తీసుకెళ్లే కార్యక్రమం ‘హర్‌ ఘర్‌ దస్తక్‌’ను డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తున్నట్టు నీతిఅయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు.

అమల్లోకి వచ్చిన ఆంక్షలు..

దేశంలో ఇప్పటివరకైతే ఎలాంటి ఒమిక్రాన్‌ కేసు నమోదుకాలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. దేశంలో ప్రస్తుతానికి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయన్నారు. మరోవైపు, విదేశీ ప్రయాణికులపై కేంద్రం జారీచేసిన తాజా ఆంక్షలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

బ్రిటన్‌లో మాస్క్‌ తప్పనిసరి

- Advertisement -

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వెలుగుచూడకముందే నెదర్లాండ్స్‌లో ఆ వేరియంట్‌ ఉనికి ఉన్నట్టు అక్కడి వైద్యులు తెలిపారు. నవంబర్‌ 19-23 తేదీల్లో నమోదైన రెండు స్థానిక కేసుల్లో ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు చెప్పారు. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌ కేసులు కు చేరడంతో ఆంక్షలు పెంచారు. దుకాణాలు, వాహనాల్లో ముఖానికి మాస్కు తప్పనిసరి చేశారు.

భారతీయులు తట్టుకోగలరు

ఒమిక్రాన్‌ పట్ల భయపడాల్సిన అవసరంలేదని, ఈ వేరియంట్‌తో పాటు కరోనాకు సంబంధించిన అన్ని వేరియంట్ల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులు రక్షణ కలిగి ఉన్నారని ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ డాక్టర్‌ షాహీద్‌ జమీల్‌ తెలిపారు. డెల్టా కారణంగా విరుచుకుపడ్డ సెకండ్‌వేవ్‌లో 67 శాతం మంది భారతీయులకు వైరస్‌ సోకిందని, దీంతో వారిలో యాంటిబాడీలు వృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్‌ ముమ్మరం చేయడంతో మరికొందరికి కూడా టీకా ద్వారా యాంటిబాడీలు వృద్ధి చెందినట్టు వెల్లడించారు. నాలుగో సెరో-సర్వేలో ఇదే విషయం బయటపడినట్టు వివరించారు. ఈ కారణాల వల్ల ఒమిక్రాన్‌తో భారతీయులకు వచ్చే ముప్పేమీ లేదన్నారు. అయితే, కరోనా జాగ్రత్తలు పాటించడం మరువొద్దని సూచించారు.

ఒమిక్రాన్‌కు కొత్త టీకాలు అవసరం! మోడెర్నా చీఫ్‌ స్టీఫెన్‌

లండన్‌: ఒమిక్రాన్‌ను ప్రస్తుత టీకాలు ఎంతవరకు అడ్డుకుంటాయనేది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. అయితే అమెరికా సంస్థ ‘మోడెర్నా’ చీఫ్‌ స్టీఫెన్‌ బాన్సెల్‌ మాత్రం బాంబు పేల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఒమిక్రాన్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని, ఈ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కొత్త టీకాలు అవసరం పడొచ్చని అభిప్రాయపడ్డారు.

అవసరమైతే టీకాను అప్‌డేట్‌ చేస్తాం: ఆక్స్‌ఫర్డ్‌

లండన్‌: ఒమిక్రాన్‌ నుంచి వ్యాక్సిన్లు రక్షణ కల్పించలేవు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పేర్కొన్నది. ఈ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైతే తమ టీకాను అప్‌డేట్‌ చేస్తామని తెలిపింది. అస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కరోనా టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. దీనిని భారత్‌లో కొవిషీల్డ్‌గా పిలుస్తున్నారు. సీరం సంస్థ దీనిని ఉత్పత్తి చేస్తున్నది.

ఏ, బీ గ్రూపుల వారికి ముప్పు ఎక్కువ

న్యూఢిల్లీ: ఓ, ఏబీ బ్లడ్‌ గ్రూపుల వారితో పోల్చుకుంటే ఏ, బీ గ్రూపులతో పాటు ఆర్‌హెచ్‌ పాజిటివ్‌ వారికి కొవిడ్‌ వ్యాప్తి ప్రమాదం ఎక్కువని ఢిల్లీలోని సర్‌ గంగారాం దవాఖాన అధ్యయనంలో తేలింది. 2,586 మంది కొవిడ్‌ రోగులపై వైద్యులు ఈ అధ్యయనం చేశారు. వీరంతా గతేడాది ఏప్రిల్‌ 8-అక్టోబర్‌ 4 వరకు చేసిన పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారని తెలిపారు.

కరోనా నియంత్రణ చర్యలు పొడిగింపు

న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో కేంద్రం వైరస్‌ నియంత్రణ చర్యలను ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ వేరియంట్‌ పట్ల రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని సూచించింది. విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నది.

గ్రీస్‌లో టీకా తీసుకోకపోతే జరిమానా

ఏథెన్స్‌: ఒమిక్రాన్‌ వ్యాపిస్తుండటంతో గ్రీస్‌ కొత్త నిబంధన విధించింది. 60 ఏండ్లు పైబడిన వారు కరోనా టీకా వేయించుకోకపోతే నెలకు 100 యూరోల (రూ.8,540) జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నిబంధన జనవరి 16 నుంచి అమలులోకి వస్తుందని ఆ దేశ ప్రధాని ప్రకటించారు. గ్రీస్‌లో ఈ వారం రికార్డు స్థాయిలో 18 వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో నాలుగొంతుల మంది వయోధికులు ఇంకా కరోనా వ్యాక్సిన్లు వేయించుకోలేదు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement