మక్తల్ : నిత్యజీవితంలో సైకిల్( Cycling ) వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ( Health ) జీవించగలుగుతామని నారాయణపేట జిల్లా సైకిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్రాంత పీటీ బి గోపాలం( Secretary Gopalam ) అన్నారు.
సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మహేందర్ పాల్ సింగ్, తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి. మల్లారెడ్డి, విజయ కాంతారావు ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక మినీ స్టేడియంలో సైకిల్ ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా 30 మంది బాలబాలికలు క్రీడా దుస్తులు, హెల్మెట్ ధరించి పురవీధుల గుండా సైకిల్ ర్యాలీ ( Cycle Rally ) నిర్వహించారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు సైకిల్‌ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండడంతో పాటు, కాలుష్యాన్ని తగ్గించిన వారమవుతామని పేర్కొన్నారు.
సైకిల్ వాడడం వలన కాళ్లు, పిక్కలు, తొడలు, ఎముకలు, కండరాలు బలంగా మారుతాయన్నారు. సైకిలింగ్ తో బరువు తగ్గడంతో పాటు ఒత్తిడిని సైతం తగ్గిస్తుందని పేర్కొన్నారు. జ్ఞాపకశక్తి పెరుగుతుందని, రక్త ప్రసరణతో గుండెపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు దరిదాపుకు రాకుండా ఉంటాయని అన్నారు. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న రైడర్స్‌కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీఈటీలు రాఘవేందర్, రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.