Comedian | వినోదం పేరుతో హద్దులు దాటి వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయడం ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో తాజాగా స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల ఘటన మరోసారి స్పష్టం చేసింది. తన కామెడీ షోలో ప్రముఖులపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. కమెడియన్ అనుదీప్ తన స్టేజ్ ప్రదర్శనలో మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా కించపరిచేలా మాట్లాడడం మెగా అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
ఇక్కడితో ఆగకుండా నందమూరి బాలకృష్ణ మరియు నారా లోకేష్ పై కూడా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నందమూరి, టీడీపీ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు పెద్ద సంఖ్యలో ది స్ట్రీట్ కామెడీ క్లబ్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఆ సమయంలో అక్కడ వేరే షో జరుగుతున్నప్పటికీ, ఆందోళనకారులు లోపలికి వెళ్లి అనుదీప్ కోసం ఆరా తీశారు. అయితే ఆయన అక్కడ లేకపోవడంతో హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోయారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భయపడిన అనుదీప్ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి కొంతకాలం ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన ప్రభావంతో సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు కామెడీ క్లబ్లు తమ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇదిలా ఉండగా, అభిమానుల ఆగ్రహం, చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశాల మధ్య అనుదీప్ కటికాల చివరికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆయన క్షమాపణలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. “ముందే ఆలోచించి మాట్లాడాల్సింది.. ఇప్పుడు భయంతో క్షమాపణలు చెప్పడం ఎందుకు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. వినోదం పేరుతో వ్యక్తిగత జీవితాలను కించపరచడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతిభతో కాకుండా వివాదాలతో గుర్తింపు పొందాలనే ప్రయత్నాలు మొత్తం రంగానికి చెడ్డపేరు తెస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 12, 2026