Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీ మెస్‌లో ఆహార నాణ్యతపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివారం ఉదయం శక్తి మెస్‌లో విద్యార్థులకు వడ్డించిన బ్రేక్‌ఫాస్ట్‌లో బొద్దింక కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రతిరోజూ నాణ్యతలేని ఆహారం అందిస్తున్నారని ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు.
ట్రిపుల్ ఐటీలోని ఈ1, ఈ2 శక్తి మెస్‌లో ఆదివారం ఉదయం విద్యార్థులకు చపాతీ, ఆలూ కూర్మా అందించారు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు ఆలూ కూర్మాలో బొద్దింకను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా మెస్‌లో కలకలం రేగింది. బ్రేక్‌ఫాస్ట్‌లో బొద్దింక కనిపించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సంబంధిత సిబ్బందిని నిలదీశారు. ప్రతిరోజూ నాణ్యతలేని ఆహారమే అందిస్తున్నారని, పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
పరిశుభ్రత లోపాల కారణంగా భోజనం చేసేందుకు కూడా భయపడాల్సి వస్తుందని.. ఒక్కోసారి భోజనం చేయకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా మెస్ ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. మెస్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థులు ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.