Tamilnadu |చెన్నై: ఆదాయం రూ. 2.5 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ (Joseph Vijay) సోమవారం అసెంబ్లీలో ప్రటించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ‘అన్నపూర్ణి సూపర్-6’ పథకాన్ని వచ్చే ఏడాది పొంగల్ నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు ఎల్పీజీ సిలిండర్ల ఖర్చును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో ప్రభుత్వంపై సుమారు రూ. 4000 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి, సిలిండర్ల ధరలు పెరిగాయి. దీంతో కుటుంబాలపై ఆర్థిక భారం పడిందని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలపై భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ట్రాన్స్జెండర్లకు (Transgender) బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మహిళలకు ‘వెట్రి పయన తిట్టం’ పథకాన్ని కూడా అమలు చేస్తామన్ని సీఎం విజయ్ అన్నారు. ఈ పథకం కింద మహిళలు ఆర్డినరీ బస్సుల్లోనే కాకుండా ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్ సర్వీసుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనివల్ల మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని సీఎం తెలిపారు. తమిళనాడులోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న ఏ మహిళ కూడా ప్రయాణ చార్జీల కారణంగా తన అవకాశాలను కోల్పోకూడదనే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ పథకాన్ని గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకాల వల్ల సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.