MAHAKALI | ‘హను మాన్’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అదే ‘మహాకాళి’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆ హైప్‌ను మరింత పదింతలు చేసింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫీమేల్ సూపర్ హీరో మైథలాజికల్ ఎపిక్‌గా ‘మహాకాళి’ రూపొందుతోంది. తాజాగా ‘శుక్రాచార్య వార్ క్రై’ పేరుతో విడుదల చేసిన వీడియో ఆద్యంతం గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఓ అమ్మవారి ఆలయంలో పసిబిడ్డను వదిలివేయడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కథ రాక్షసుల రాజగురువైన శుక్రాచార్యుడు చేసే భీకర తపస్సు, ఆయన ప్రతీకార సంకల్పం వైపు సాగుతుంది.
క్షీరసాగర మథనం సమయంలో రాక్షసులకు అమృతం దక్కకుండా చేసి, రాక్షస జాతి వినాశనానికి కారణమైన శ్రీ మహావిష్ణువుపై శుక్రాచార్యుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్‌గా కనిపించారు. కేవలం 14 రోజుల్లో అసుర విజయ ఘోష సమస్త బ్రహ్మాండంలో ప్రతిధ్వనించేలా చేస్తానంటూ ఆయన చేసే ప్రతిజ్ఞ కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు ఆ 14 రోజుల ప్లాన్ ఏమిటి? రాక్షసుల విజయానికి శుక్రాచార్యుడు ఎలాంటి శక్తులను ఉపయోగించబోతున్నాడు? అతని భీకర సంకల్పాన్ని అడ్డుకోవడానికి మహాకాళి ఎలా అవతరిస్తుంది? అనే ప్రశ్నలను గ్లింప్స్ ప్రేక్షకుల ముందుంచింది.
గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మహాకాళి రౌద్ర రూపం. నల్లని వర్ణం, ముక్కుపుడక, ఉగ్ర స్వరూపంతో అమ్మవారిని అత్యంత శక్తిమంతంగా చూపించారు. ముఖ్యంగా చెడును అంతం చేసే రౌద్ర రూపంలో కనిపించిన భద్రకాళి.. చివర్లో ఓ పసిబిడ్డను ఎత్తుకుని లాలించే శాంత స్వరూపిణిగా కనిపించడం గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. మహాకాళి ఎత్తుకున్న ఆ పసిబిడ్డ ఎవరు? ఆ బిడ్డకు శుక్రాచార్యుడి ప్రతీకారానికి ఉన్న సంబంధం ఏమిటి? అన్న సస్పెన్స్‌తో మేకర్స్ కథపై క్యూరియాసిటీని మరింత పెంచేశారు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ రోల్ అయిన మహాకాళి పాత్రలో భూమి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రియా రెడ్డి కూడా కీలకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటిస్తుండగా.. రోహిత్ సరాఫ్, మురళీ శర్మ, సముద్రఖని, నాజర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా వచ్చిన ‘శుక్రాచార్య వార్ క్రై’ గ్లింప్స్ ఆ అంచనాలను మరింత పెంచింది.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘హను మాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ పవర్ఫుల్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.