Citigroup Layoff | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘సిటీ గ్రూప్’ మరో రెండు వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపనున్నది. ఇప్పటికే ఈ ఏడాది ఐదు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. బ్యాంకు పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 2000 ఉద్యోగాలు తొలగించనున్నది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు పరిహారం చెల్లించడానికి 650 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది సిటీ గ్రూప్.
సిటీ గ్రూపు ఆర్థిక ఫలితాలపై విశ్లేషకులతో కాన్ఫరెన్స్ కాల్లో సిటీ గ్రూప్ ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ మాట్లాడుతూ ఈ ఏడాది మొత్తం ఏడువేల మందిని తొలగించామన్నారు. ఐదు కీలక వ్యాపార రంగాలపై ఫోకస్ చేయడం కోసం కంపెనీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్యాంకు పునర్వ్యవస్థీకరణతో మరిన్ని ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని, ఎంత మందిని తొలగిస్తామో ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు.
దాదాపు ఏడు వేల మందిని తొలగించినా.. సిటీ గ్రూపులో సుమారు 2.40 లక్షల మంది పని చేస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కేవలం లండన్ శాఖలోనే 30 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, 20 కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులను తొలగించినట్లు స్టాక్స్ ఎక్క్చేంజ్ ఫైలింగ్ లో సిటీ గ్రూపు తెలిపింది. లండన్, న్యూయార్క్ నగరాల పరిధిలో ఉద్యోగులను తొలగిస్తున్నది. విదేశీ స్టాక్ మార్కెట్లలో అనాలసిస్, కామెంటరీలతో అంతర్జాతీయ టీంలను తొలగిస్తున్నది. న్యూయార్క్, లండన్ శాఖలతోపాటు లాటిన్ అమెరికా దేశాల్లో వర్క్ ఫోర్స్ తగ్గించుకోవడానికి యాజమాన్యం నిర్ణయించడంతో ఉద్యోగులు బ్యాంకును వీడుతున్నారు.