‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సక్సెస్ జోష్‌లో ఆయన వరుస సినిమాల్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి తన తదుపరి సినిమా చేయబోతున్నారు. ఇది ఆయన నటిస్తున్న 158వ చిత్రం. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీని తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇంత బిజీ లైనప్‌లో కూడా చిరు మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్.
అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్య కథాంశమిదని సమాచారం. ఈ జోనర్లో మెగాస్టార్ సినిమా చేసి చాలా రోజులైంది. దాంతో ఈ సినిమాకు ఆయన వెంటనే అంగీకరించారని అంటున్నారు. అయితే చిరంజీవి ప్రజెంట్ కమిట్మెంట్స్ను బట్టి చూస్తే ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లే ఛాన్స్ ఉందట. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.