తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు చిత్ర ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. సినీరంగాన్ని నమ్ముకొని ఉన్న వేలాది మంది కార్మికుల భవిష్యత్తుకు మేలు చేసే గొప్ప నిర్ణయమిదని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికను మన్నించి..నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికి న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్లు సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు మేలు చేసే నిర్ణయమిది’. – చిరంజీవి
‘తెలుగు సినీ పరిశ్రమకు ఎంతగానో మేలు చేసే గొప్ప నిర్ణయమిది. ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’
– అక్కినేని నాగార్జున
‘సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం 101శాతం కృషిచేస్తున్నది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో ఎల్లప్పుడు అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నది.దేశంలోనే పెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన టాలీవుడ్ పురోభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నాప్రభుత్వాన్ని నేను ప్రేమిస్తున్నా’.
– విజయ్ దేవరకొండ