న్యూయార్క్ : అమెరికా ప్రపంచంలోనే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటారు. అలాంటి అగ్ర రాజ్యంలోనూ కొన్ని చీకటి కోణాలున్నాయి. ఇప్పటికీ ఆ దేశంలోని 32 రాష్ర్టాల్లో బాల్య వివాహాలను చట్టాలు అనుమతిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రం బాల్య వివాహాలను రద్దు చేసింది. ఇక నుంచి పెళ్లి చేసుకునే ఇద్దరికీ 18 ఏండ్లు నిండాలి. 2027 జనవరి 1 నుంచి ఈ చట్టం కాలిఫోర్నియాలో అమల్లోకిరానుంది. ఈ చట్టంపై సంతకం చేసిన కార్యక్రమంలో కోర్ట్నీ స్టోడెడ్ కూడా పాల్గొన్నారు.
ఆమె 16 ఏండ్ల వయసులోనే 51 ఏండ్ల డగ్ హచిసన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి గుర్తింపు పొందారు. అయితే అమెరికాలోని 50 రాష్ర్టాలకు గాను ఇప్పటికి 18 రాష్ర్టాల్లోనే ఈ బాల్య వివాహాల నిషేధిత చట్టం అమల్లో ఉంది. మిగతా 32 రాష్ర్టాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో బాల్య వివాహాలను చట్టాలే అనుమతిస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి 2015 మధ్య అమెరికాలో 2 లక్షల 60వేల మంది బాల్య వివాహాలు చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అభివృద్ధి విషయంలో అమెరికాతో భారత్ పోటీ పడలేదు కానీ.. ఇలాంటి సామాజిక అంశాల్లో మాత్రం భారత్ అనేక రెట్లు ముందు వరుసలో ఉన్నది. ఇండియాలో బాల్య వివాహాలను ఎన్నడో నిషేధించారు. భారత్లో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి 21 ఏండ్లు, అమ్మాయికి 18 ఏండ్లు కచ్చితంగా ఉండాల్సిందే. బాల్య వివాహాల ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో భారత్లోని అనేక రాష్ర్టాల్లో ఇది పక్కాగా అమలవుతున్నది. కానీ కొన్ని రాష్ర్టాల్లో ఇప్పటికీ బయటకు తెలియనివ్వకుండా ఇలాంటి బాల్య వివాహాలు జరిపిస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే అమెరికా ఎంతో అభివృద్ధి చెందినా స్త్రీల హక్కులను కాపాడే విషయంలో భారత్ ముందు వరుసలో నిలిచిందనే చెప్పుకోవాలి.