ఒట్లు.. తిట్లు.. క్షుద్ర పరిహాసాలు
ముఖ్యమంత్రి ఒట్లు, ప్రమాణాల చిట్టా పెరిగిపోతున్నది. ఆ ఒట్ల జాబితాను చూసి జనం నవ్వుకుంటున్నరు. తమ వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకొని సీఎం తీరును ఎండగడుతున్నారు. ఆ సందేశాల సరళిని పరిశీలిస్తే.. ‘పోలేపల్లి ఎల్లమ్మతల్లికి దండంపెట్టి.. ఒట్లు తిని బయలుదేరిన.
తర్కశాస్త్రం ప్రకారం ఒట్టు అనేది బలహీనుడు ఆశ్రయించే మానసిక కవచం. తన మాట మీద సమాజానికి గురిలేనప్పుడు, తన హామీకి తగిన విశ్వసనీయత లేనప్పుడు, తన వాదనకు సాక్ష్యాధారాలు చూపలేనప్పుడు మనిషి అదృశ్య శక్తులను మధ్యవర్తులుగా పిలుస్తడు. పల్లెల్లో తగాదాలు వచ్చినప్పుడు సాక్ష్యాధారాలు లేని వేళ ‘తడిబట్టల మీద హన్మాండ్ల తలకొట్టి, ఒట్టు పెట్టు’ అనటం సహజ జానపద న్యాయసూత్రం. కానీ కార్యనిర్వాహక అధినేతకు ఈ జానపద పంచాయితీ బుద్ధులే ఆదెరువు కావటం.. ప్రభుత్వ యంత్రాంగం కంటే గ్రామ దేవతల దర్బారులే ఎక్కువ ప్రాసంగికం కావటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం.
ముఖ్యమంత్రి ఒట్లు, ప్రమాణాల చిట్టా పెరిగిపోతున్నది. ఆ ఒట్ల జాబితాను చూసి జనం నవ్వుకుంటున్నరు. తమ వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకొని సీఎం తీరును ఎండగడుతున్నారు. ఆ సందేశాల సరళిని పరిశీలిస్తే.. ‘పోలేపల్లి ఎల్లమ్మతల్లికి దండంపెట్టి.. ఒట్లు తిని బయలుదేరిన. రామప్ప రుద్రేశ్వరుడి సాక్షిగా.. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల సాక్షిగా.. కొమరవెల్లి మల్లన్న నెత్తిన చేయివేసి.. బాసర జ్ఞాన సరస్వతి మందిరం మీద ఆన.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి ఆజ్ఞ, భద్రాద్రి కోదండరాముడి ముద్ర, కురుమూర్తి స్వామి, అనంతగిరి అనంత పద్మనాభుడు.. మెదక్ మహా కేథడ్రల్ చర్చి క్రీస్తు కరుణ, ఏడుపాయల వనదుర్గమ్మ కటాక్షం..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్ల రిజిస్టర్ తెరిచి తన రాజకీయ హామీలకు వారిని సాక్షులుగా నిలబెట్టిన దృశ్యమానం కనిపిస్తున్నది.
ఎదురైన గోపురానికి మొక్కి, కనిపించిన దేవుళ్ల విగ్రహాల్ని రాజకీయ వేదికలుగా మలచుకోవడం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ మొదలుకొని లగచర్ల పొలిమేర మైసమ్మ వరకు ఒట్లు తినటం నిత్యకృత్యమైంది. దైవస్మరణతో మొదలయ్యే ఉపన్యాసం క్రమంగా కేసీఆర్, ఆయన కుటుంబం మీదికి మళ్లే సరికి ప్రయోగించే భాషా సౌందర్యం మరింత సంక్షోభభరితం అవుతున్నది. ఏ ఎల్లమ్మ తల్లిని కొలుస్తారో.. అదే వేదికపై నుంచి కేసీఆర్ కుటుంబం మీద బజారు పదజాలంతో దండయాత్ర చేయడం సీఎం మానసిక స్థితిలోని గందరగోళానికి పరాకాష్ట. మొన్న కొడంగల్‌లో ఎల్లమ్మ తల్లికి ప్రణమిల్లి మైకు అందుకున్న రేవంత్‌రెడ్డి.. అదే నోటితో కేసీఆర్ కుటుంబంపై ఒంటికాలిపై లేస్తూ, అసహ్యకరమైన భాషా ప్రహసనం సాగించిన తీరు చూశాం. మోకాళ్ల దాకా గడ్డం పెంచినా నక్క పులి కాలేదు అంటూ వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శించిన తీరు సమాజం విన్నది.
కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్నారని, రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్ప భారం మోపారని రేవంత్‌రెడ్డి నిరంతరం గగ్గోలు పెట్టడం గమనిస్తూనే ఉన్నం. ప్రజలు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. గత ప్రభుత్వం ఏమైనా తప్పిదాలు చేసినట్టు అనిపిస్తే విచారణ జరిపించాల్సిన వ్యవస్థ సర్కార్ చేతుల్లోనే ఉన్నది. అంతేకానీ, సభల్లో జానపద వీధి నాటకాలను తలపించేలా రంకెలు వేయడం పాలన అనిపించుకోదు. అంతేకాకుండా, విమర్శలలో హుందాతనం లోపించడం రాజకీయ సాంస్కృతిక దివాలాకోరుతనం.
కేసీఆర్ పాలనలో లోపాలు కనిపిస్తే ఆర్థిక గణాంకాలు, ఫైళ్ల ఆధారాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా మాట్లాడాలి. అంతేకానీ నిరాధారంగా వ్యక్తిగత దూషణలకు దిగడం, ఇతరుల శరీర ఛాయలు, వస్త్రధారణ, శారీరక శైలిని అవహేళన చేయడం నాయకత్వ స్థాయిని దిగజార్చుతుంది. గుడ్లు పీకుతా, గోళీలాడుతా, గోదాట్లో తొక్కుతా, వంటి పద ప్రయోగాలు.. పులి, నక్క, లాంటి జంతు రూపకాలను వాడుతూ సభలలో ప్రసంగించడం తాత్కాలికంగా కార్యకర్తల చప్పట్లకు పనికిరావచ్చు గానీ, అది పరిపాలనా దక్షతకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. అధికార పీఠంపై కూర్చున్న నేతలు దుందుడుకు భాషను కొనసాగించడం సమంజసం కాదు.
ఇక్కడో ఘటన గుర్తు చేయాలి. 2024 ఏప్రిల్ 20న మెదక్ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా అన్నారు. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు తెలిపారు. అయిందా? దాదాపు 7 లక్షల మందికి పైగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. బ్యాంకు నోటీసులు వచ్చినప్పుడు దిక్కెవరు? ఆ వాస్తవం సామాన్యుడికి కూడా తెలుసు. కానీ, పాలకుడు మాత్రం ప్రజలను మూఢ నమ్మకాలతో ఆడుకుంటున్నాడు. ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనుడైన రేవంత్‌రెడ్డి చట్టసభ వేదికపై ప్రసంగిస్తూ అఘోర పూజలు, క్షుద్ర విద్యలు అంటూ మధ్యయుగపు పచ్చి మంత్రగాళ్ల భాషలో గగ్గోలు పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని కళంకం. రాజకీయ ప్రత్యర్థిని నిలువరించలేక క్షుద్ర భూతాన్ని రాజముద్రతో ప్రజల మనసులలోకి జొప్పించడంతో.. అది అట్టడుగు సమాజంపై ప్రభావం చూపిస్తున్నది. వాతావరణ మార్పులు, ఎల్ నినో గురించి శాస్త్రవేత్తలు చెప్తుంటే, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మనిషి మంత్రగాళ్ల కథలు వినిపించడమేంటి? పాలకుడు ఇలాంటి భాష మాట్లాడుతుంటే ప్రజలు బిత్తరపోతున్నారు.
కేసీఆర్ దార్శనిక పాలన ముగిసే నాటికి, అంటే డిసెంబర్ 2023 నాటికి రాష్ట్రం ఏటా 2.50 కోట్ల నుంచి 2.70 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందులోనూ ప్రజలు అత్యంత ప్రీతిపాత్రంగా భుజించే మేలైన సన్నవడ్ల దిగుబడే ఒక కోటి మెట్రిక్ టన్నులు. వీటితోపాటు మరో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలతో గోదాములు కళకళలాడాయి.
అంతటి కొండంత నిల్వలు నేడు కండ్ల ముందే కనుమరుగైతున్నయి. కిలో సన్నబియ్యం రూ.100కు చేరింది. ధాన్యాగారంగా విలసిల్లే నేలపై ఒక పూట పట్టెడు బువ్వకు రూ.100 నోటు సమర్పించుకోలేక పేద, మధ్య తరగతి ప్రజానీకం ఆకలితో అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుళ్లలో ఒట్లతో, తిట్లతో ప్రజలను మభ్యపెట్టడం కంటే ప్రజాస్వామ్య క్రూర పరిహాసం మరొకటి ఉంటుందా? ధరల నియంత్రణకు అవసరమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలు, ఎగుమతి, దిగుమతి పర్యవేక్షణ గురించి మాట్లాడాల్సిన నాయకత్వం, క్షుద్ర రాజకీయ చర్చను తెరపైకి తీసుకురావడం గర్హనీయం. అన్నదాత సంపదను కాపాడలేని చేతకానితనాన్ని తాంత్రిక నిందలతో పక్కదారి పట్టించడం పచ్చి తార్కిక నేరం.
ప్రజాస్వామ్యంలో పాలకుడు గవర్నర్ ముందు రాజ్యాంగం మీద చేసిన ప్రమాణమే అన్నిటికంటే సర్వోన్నతమైనది. ఆ ప్రాథమిక ప్రమాణాన్ని విస్మరించి, నిత్యం రోడ్లపై, రచ్చబండలపై, గుళ్ల ప్రాంగణాల్లో కొత్త ప్రమాణాలు చేస్తూ తిరగడం దేనికి సంకేతం? ప్రజలకు వాస్తవాలు వివరించే ధైర్యం లేకపోవడమే ఇందుకు మూలకారణం.
ఖజానాలో ఉన్నదెంత, పథకాలకు కావలసిందెంత, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలేమిటన్నది నిర్మొహమాటంగా ప్రజల ముందు పెట్టినప్పుడే అసలైన పారదర్శకత సాధ్యమవుతుంది. అంతేకాని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేవుళ్ల మీద ఒట్లు, ప్రజల దృష్టిని మళ్లించడానికి పూర్వ పాలకులపై నిరంతర శాపనార్థాలు అనే ఎత్తుగడ ఎంతో కాలం నిలువదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. పోరాటాల గడ్డపై నుంచి వచ్చిన ప్రజలకు భక్తి ఎంత తెలుసో, హక్కుల సాధన కూడా అంతే స్పష్టంగా తెలుసు. నాయకులు ఒట్లు, తిట్లను కట్టిపెట్టి, ప్రజలకిచ్చిన గ్యారెంటీలు, వాగ్దానాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసే దిశగా ఇప్పటికైనా నడువాలి. లేదంటే ప్రజలే కొలువు కూటాన్ని సంప్రోక్షణ చేసే కాలం ఎంతో దూరంలో ఉండదు.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

