సిరీస్ పట్టేస్తారా..
టీ20 కెప్టెన్‌గా విజయపథంలో నడుస్తున్న శ్రేయస్ అయ్యర్ తొలిసారి వన్డే జట్టు నాయకుడిగా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగే నాలుగో మ్యాచ్ లో కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాలని చూస్తున్నాడు.
- నేడు న్యూజిలాండ్‌తో భారత్ నాలుగో వన్డేl గిల్ గైర్హాజరీలో కెప్టెన్సీ చేపట్టిన శ్రేయస్
- ఉదయం 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
మౌంట్ మాంగనీ: టీ20 కెప్టెన్‌గా విజయపథంలో నడుస్తున్న శ్రేయస్ అయ్యర్ తొలిసారి వన్డే జట్టు నాయకుడిగా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగే నాలుగో మ్యాచ్ లో కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాలని చూస్తున్నాడు. రెండు వరుసవిజయాల తర్వాత హామిల్టన్ మూడో పోరు వర్షంతో రద్దవగా.. టెస్టు సిరీస్ సన్నాహకాల కోసం రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే జట్టును వీడాడు. దాంతో జట్టు పగ్గాలు చేపట్టిన అయ్యర్‌కు బ్యాటర్ గానే కాకుండా నాయకుడిగా పరీక్ష ఎదురవనుంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ పోరులో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఏడేండ్ల తర్వాత స్వదేశంలో వన్డే సిరీస్ ఓటమిని తప్పించుకోవాలంటే కివీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
బరిలోకి ఇషాన్, గైక్వాడ్, సిరాజ్
ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ సన్నాహకాల కోసం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, పేసర్ అన్షుల్ కాంబోజ్‌తో పాటు సగం మంది కోచింగ్ సిబ్బంది వెల్లింగ్టన్లోని టెస్ట్ క్యాంప్‌కు వెళ్లిపోయారు. దీంతో మిగిలిన రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గిల్ గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా కిషన్ నిర్వర్తించనున్నాడు. గాయం కారణంగా టీ20లకు దూరమైన ఇషాన్ తో ఓపెనింగ్ స్లాట్ కోసం రుతురాజ్ గైక్వాడ్ పోటీ పడుతున్నాడు.
కానీ, నాలుగేండ్ల కిందట ఈ ఫార్మాట్ లో ఓపెనర్ గా డబుల్ సెంచరీ కొట్టిన ఇషాన్ కే మొగ్గు కనిపిస్తోంది. తన చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్‌లలో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రుతురాజ్ మరోసారి ఆ బాధ్యత తీసుకోనున్నాడు. ఇక, గత రెండు మ్యాచ్‌ల్లో 0, 23 స్కోర్లతో విఫలమైన రోహిత్ తో పాటు షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీ ఇన్నింగ్స్ ఆడటం భారత్ కు కీలకం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని సీనియర్ పేసర్ సిరాజ్.. అన్షుల్ కాంబోజ్ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్‌ను తుది జట్టులో ఆడించే అవకాశముంది.
కివీస్ జట్టులోనూ మార్పులు
టెస్ట్ సిరీస్ దృష్ట్యా న్యూజిలాండ్ కూడా తమ ప్రధాన ఆటగాళ్లయిన టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రీ నికోల్స్, నేథన్ స్మిత్‌కు విశ్రాంతినిచ్చింది. వీరి స్థానంలో విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్, మిచ్ హే, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బ్రెట్ రాండెల్ జట్టులోకి వచ్చారు. ఈ ఫార్మాట్ లో నిలకడగా ఆడలేకపోతున్న సిఫర్ట్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. కీలక బ్యాటర్ల గైర్హాజరీలో తను జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. డ్యాషింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ పైనా ఆతిథ్య జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ఇక, గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ తిరిగి జట్టులోకి రావడం కివీస్ బౌలింగ్‌కు బలం చేకూర్చనుంది. మరి, తొలి రెండు మ్యాచ్ ల్లో నిరాశపరిచిన కివీస్ ఈ పోరులో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకుంటుందో లేదో చూడాలి.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ , ఇషాన్ (కీపర్), కోహ్లీ, శ్రేయస్ (కెప్టెన్), రుతురాజ్, నమన్, అక్షర్, నబీ, సిరాజ్, బ్రార్, అర్ష్‌దీప్. న్యూజిలాండ్: అలెన్, సిఫర్ట్ (కీపర్), విల్ యంగ్, నిక్ కెల్లీ, మిచ్ హే, బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), ఫాక్స్‌క్రాఫ్ట్, జేమీసన్, హెన్రీ, డఫీ.
పిచ్ / వాతావరణం
తొలి మూడు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, శుక్రవారం మౌంట్ మాంగనీలో వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉండే అవకాశముంది. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు కాస్త అనుకూలించే సూచనలున్నాయి. ఈ స్టేడియంలో జరిగిన గత నాలుగు డే-నైట్ వన్డేల్లో ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

