ఉపాధి ‘కల్పనే’
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు పెడుతున్నదని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవతరించిందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం ప్రచారం చేసుకుంటున్నది.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు పెడుతున్నదని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవతరించిందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం ప్రచారం చేసుకుంటున్నది. జీడీపీ వృద్ధి, స్టాక్ మార్కెట్ల రికార్డులు, కార్పొరేట్ సంస్థల లాభాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ అంటూ గొప్పలు చెప్పుకోవడం సరేసరి. కానీ ఈ అభివృద్ధి ఫలాలు సామాన్యులకు, ముఖ్యంగా దేశ యువతకు ఎంతవరకు అందుతున్నాయనే ప్రశ్నకు మాత్రం బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) దేశంలో ఉపాధి పరిస్థితిపై వెలువరించిన తాజా నివేదిక ఆందోళనకరమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. సీఎంఐఈ గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో 4 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 4.7 శాతానికి పెరిగింది. దేశంలో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఉద్యోగిత రేటు సెప్టెంబర్‌లో 39.4 శాతం ఉండగా అక్టోబర్‌లో 39.3 శాతానికి పడిపోయింది. అక్టోబర్‌లో ఉపాధి పొందినవారి సంఖ్య దాదాపు ఐదు లక్షల మేర తగ్గి 44.95 కోట్లకు చేరింది. గ్రామీణ నిరుద్యోగిత 3.4 శాతం నుంచి 4.7 శాతానికి పెరగడం, మహిళల నిరుద్యోగిత 11.7 శాతం నుంచి 12.7 శాతానికి చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇవి కేవలం గణాంకాలు కావు. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం నిరీక్షిస్తున్న కోట్లాది మంది యువతీ యువకుల నిరాశకు ప్రతిబింబాలు.
2014 ఎన్నికల ప్రచారంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ నాయకులు ప్రచారాలతో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి 12 ఏండ్లు దాటినా ఆ హామీ ఏమైందన్న ప్రశ్నకు కేంద్రం దగ్గర సమాధానం లేదు. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తూ, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, వయోపరిమితి దాటిపోతున్న యువతకు ఈ హామీ ఎండమావిగా మారింది. ఎన్నికల ముందు యువత భవిష్యత్తును తమ ప్రచారానికి ఉపయోగించుకున్న బీజేపీ, అధికారంలోకి వచ్చాక ఉపాధి కల్పన గురించి ఏనాడూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ వైఫల్యానికి మరో పెద్ద ఉదాహరణ. 2014 లో అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తామని, తయారీ రంగం వాటాను జీడీపీలో 25 శాతానికి పెంచుతామని, భారీగా ఉద్యోగాలు సృష్టిస్తామని ఊరించారు. విదేశీ కంపెనీలను భారత్‌కు ఆహ్వానించారు. ప్రచార పటాటోపం, భారీ సదస్సులు, పెట్టుబడుల ఒప్పందాలతో దేశమంతా హోరెత్తించారు. కానీ దశాబ్దం దాటిన తర్వాత కూడా తయారీ రంగం వాటా జీడీపీలో 15 నుంచి 17 శాతం మధ్యనే కొట్టుమిట్టాడుతున్నది. భారీగా ఉపాధి కల్పిస్తామని ప్రకటించిన లక్ష్యం పడకేసింది. మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి, క్షేత్రస్థాయిలో పరిశ్రమల విస్తరణకు మధ్య అంతరం వెక్కిరిస్తున్నది.
ఇక్కడ మరో ప్రమాదకర పరిణామం ఏమిటంటే, ఉపాధి గణాంకాల్లో ఉద్యోగులుగా నమోదవుతున్నవారిలో చాలామంది వాస్తవానికి స్వయం ఉపాధి, వ్యవసాయ పనులు, తాత్కాలిక పనులపై ఆధారపడుతున్నవారే. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి చిన్న వ్యాపారం చేయడం, తక్కువ ఆదాయంతో రోజువారీగా కూలీపని చేసుకోవడం కూడా ఉపాధిగానే లెక్కలోకి వస్తుంది. కానీ సదరు అరకొర ఉపాధి ద్వారా లభించే ఆదాయాలు గౌరవప్రదమైన జీవనానికి సరిపోతున్నాయా? అనేది ప్రశ్న. కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, భారీ రుణ సదుపాయాలు కల్పించడంలో చూపుతున్న శ్రద్ధలో కొంతైనా యువతకు ఉద్యోగాలు కల్పించడంపై చూపితే దేశ ఆర్థిక ముఖచిత్రం మరోలా ఉండేది. కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఒక జాతీయ సమగ్ర ఉపాధి విధానాన్ని ప్రకటించాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు నిర్ణీత వ్యవధిలో భర్తీ చేయాలి. మేక్ ఇన్ ఇండియా, పీఎల్ఐ పథకాల కింద వాస్తవం గా ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలి. యువతకు ఉద్యోగాలు కల్పించలేని పాలకులు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుంది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

