ఖైరతాబాద్, మే 30: ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని చేరింది. రాష్ట్రంలోనే తొలి అత్యాధునిక క్యాన్సర్ జీనోమిక్స్ కేంద్రాన్ని నిమ్స్‌లో ప్రారంభించారు. దీని ద్వారా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఆధారిత క్యాన్సర్ నిర్ధారణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. క్యాన్సర్ కణాల్లో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ స్థాయిలో సంభవించే జన్యుమార్పులను అత్యంత కచ్చితత్వంతో నిర్ధారించి, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా రోగికి అనువైన చికిత్స, మందులను అందజేసేందుకు ఇది వీలుకల్పిస్తుంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ‘డైమండ్స్’ ప్రాజెక్టు కింద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం తెలంగాణ వాసులే కాకుండా పొరుగు రాష్ర్టాల రోగులకు సైతం సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆధునిక క్యాన్సర్ నిర్ధారణ సేవలను అందుబాటులో తీసుకురావడం డైమండ్స్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
దేశవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. వాటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి నిమ్స్ ఎంపికైంది. ఈ కేంద్రంలో క్యాన్సర్ రోగులకు ఎన్జీఎస్, పీసీఆర్, డిజిటల్ డ్రాప్లెట్ పీసీఆర్, ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ తదితర ఆధునిక మాలిక్యూలర్ డయాగ్నస్టిక్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. ఈ ఉచిత సేవల ద్వారా 2024 నుంచి ఇప్పటి వరకు 1,443 మంది క్యాన్సర్ రోగులు లబ్ధిపొందారని, వారిలో 784 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్, 659 మంది రొమ్ము క్యాన్సర్ రోగులు ఉన్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ శాంతివీర్ జీ ఉప్పిన్ తెలిపారు.