లండన్: ఫైదుబాయ్ ఘటనను మరువక ముందే గగనంలో మరో విమానంలో గగుర్పాటు ఎదురైంది. బ్రిటిష్ ఎయిర్వేస్ ఐర్లాండ్ గగనతలంలో ఆకస్మికంగా వేల అడుగుల కిందకు దిగడంతో పైలట్లు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి షికాగో ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:50 గంటలకు బయలు దేరింది.
సుమారు గంట తర్వాత ఐర్లాండ్ మీదుగా ఎగురుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపాలు ఎదురయ్యాయి. విమానం నిమిషాల్లోనే దాదాపు 28 వేల అడుగులు వేగంగా కిందకు దిగింది. అప్రమత్తమైన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు అత్యవసర పరిస్థితిని తెలియజేశారు. ఈ అనూహ్య పరిణామం తర్వాత విమానాన్ని తిరిగి లండన్ హీత్రో విమానాశ్రయం వైపు మళ్లించారు. విమానం ఆకస్మికంగా కిందకు దిగడానికి, అత్యవసరంగా వెనక్కి మళ్లించడానికి గల కారణాలు వెల్లడికాలేదు.