Deadbodies | నేపాల్ వరదల్లో వందల మంది చనిపోయారు. వారి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. భారతదేశంతో సరిహద్దు పంచుకునే నేపాల్లోని చిత్వాన్ (Chitwan) జిల్లాలో అత్యధికంగా 132 మృతదేహాలు లభ్యమయ్యాయి. భారత్లోని ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్ వద్ద గండక్ నదిలో మూడు మృతదేహాలను వెలికితీశారు.
భారత సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్ (SSB) వీటిని గుర్తించి మోటార్ బోట్ల సహాయంతో వెలికితీశారు. ఈ మృతదేహాల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడివి ఉన్నాయని ఎస్ఎస్బీ ఇన్స్పెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. వారి వివరాలు ఇంకా తెలియలేదు. ఇవి అక్కడి మృతదేహాలే అయితే సుమారు 200 కిలోమీటర్ల దూరం కొట్టుకొచ్చాయని భావిస్తున్నారు.

Gandak River
నేపాల్లో హిమపాతం, భారీ వర్షాల వల్ల నారాయణి (Narayani) నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడి భోటెకోశి, త్రిశూలి నదులు కలిసి నారాయణి నదిగా మారుతాయి. దీన్నే కాళీ గండకీ అని కూడా పిలుస్తారు. ఈ నది భారత్లోకి ప్రవహిస్తుంది. దీన్ని ఇక్కడ గండక్ అని పిలుస్తారు. ఇది భారత్లోని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల గుండా ప్రవహించి పట్నా సమీపంలోని హాజీపూర్-సోనేపూర్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
నేపాల్ వరదల కారణంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ (Gandak) నది పరీవాహక ప్రాంతాల్లోని పలు లోతట్టు గ్రామాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.