Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో 22వ రోజు ఇంట్లో వాతావరణం మరింత వేడెక్కింది. మిథిలేష్ ఎలిమినేషన్ తర్వాత కూడా హౌస్‌లో గ్రూపిజం, గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అపూర్వ, ముకేశ్ మధ్య వర్క్ విషయంలో జరిగిన వివాదం పెద్ద చర్చకు దారితీసింది. కెప్టెన్ అపూర్వ ఆదేశాలను ముకేశ్ పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.తాను చెప్పిన పనిని చేయనని ముకేశ్ స్పష్టం చేయడంతో అపూర్వ కెప్టెన్ మీటింగ్ ఏర్పాటు చేసింది. అయితే మీటింగ్‌లోనూ ముకేశ్, అపూర్వ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తనను కెప్టెన్‌గా గౌరవించడం లేదని అపూర్వ అసహనం వ్యక్తం చేసింది. ముకేశ్‌తో పాటు త్రిగున్ కూడా తనకు డిస్రెస్పెక్ట్ ఇస్తున్నారని, ఇద్దరూ తనను కెప్టెన్ అని పిలవాల్సిందేనని చెప్పింది. అయితే త్రిగున్ మాత్రం తాను అలా పిలవనని స్పష్టం చేశాడు.
మరోవైపు రోహిత్, షాలిని మధ్య జరిగిన సంభాషణలో కూడా అపూర్వ ప్రస్తావన రావడంతో పరిస్థితి వేడెక్కింది. అపూర్వ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి షాలినిలో ఒకరకమైన అసహనం కనిపిస్తోందనే చర్చ కూడా సాగింది. ఇదే సమయంలో దేబ్జానీ, త్రిగున్, రామ్ ప్రసాద్‌తో మాట్లాడుతూ ఇంట్లో ఉన్న గ్రూపిజంపై తన అభిప్రాయాలను పంచుకుంది. మిథిలేష్‌కు కూడా ఒక గ్రూప్ కలిసి మద్దతు ఇచ్చిందని ఆమె చెప్పింది. ఇక ఈ వారం బిగ్ బాస్ ‘టోటల్ డామినేషన్’ అనే కాన్సెప్ట్‌ను ప్రకటించాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులను రెండు జట్లుగా విభజించాడు. వర్షిణి, ఝాన్సీ, రోహిత్, అపూర్వ, రామ్ ప్రసాద్, అమన్, వంశీ, సుధీర్ ఒక జట్టుగా ఏర్పడ్డారు. ఈ టీమ్‌కు ‘భైరవ’ అనే పేరు పెట్టుకున్నారు.
మరోవైపు షాలిని, సృష్టి, చరణ్, నరేష్, త్రిగున్, ముకేశ్, దేబ్జానీ కలిసి రెండో జట్టుగా ఏర్పడ్డారు. వీరి టీమ్‌కు ‘సప్త శక్తి’ అనే పేరు పెట్టుకున్నారు. ఈ టాస్కుల్లో గెలిచిన జట్టుకు వచ్చే వారంలో ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని బిగ్ బాస్ ప్రకటించాడు. అందులో భాగంగా ప్రతి కంటెస్టెంట్ కత్తులను సంపాదించుకోవాల్సి ఉంటుంది. కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ కత్తులు సంపాదించుకున్న వారికి ఆరో వారంలో ప్రత్యేక బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పడంతో కంటెస్టెంట్స్ మధ్య పోటీ మొదలైంది. కత్తులను దాచుకునే ప్రయత్నంలో ఝాన్సీ, వర్షిణి, అపూర్వలు జాగ్రత్త పడ్డారు. మరోవైపు ముకేశ్.. వర్షిణి దగ్గర ఉన్న కత్తిని తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రెండు జట్ల మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. నరేష్, రామ్ ప్రసాద్ వేర్వేరు టీమ్‌లలో ఉండటంతో తొలిసారి వీరిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది.
ఆ తర్వాత బిగ్ బాస్ ‘రణరంగంలో రథ నిర్మాణం’ అనే టాస్క్‌ను ఇచ్చాడు. రథాన్ని నిర్మించేందుకు అవసరమైన విడిభాగాలను కంటెస్టెంట్స్ టాస్క్‌లో గెలిచి సొంతం చేసుకోవాలి. బిగ్ బాస్ రెండు ప్రాంతాల నుంచి బార్లను విడుదల చేయగా, కంటెస్టెంట్స్ వాటిని సేకరించి తమ టీమ్ వద్ద భద్రపరుచుకోవాలి. ఎక్కువ రౌండ్లు గెలిచి, ఎక్కువ బార్లు సేకరించిన టీమ్ రథాన్ని నిర్మించే అవకాశం దక్కించుకుంటుంది. టాస్క్‌కు ముందు రోహిత్, షాలిని మాట్లాడుకుంటుండగా అపూర్వ అక్కడికి రావడంతో షాలిని అసహనం వ్యక్తం చేసింది. తాము మాట్లాడుకుంటున్నామని చెప్పడంతో అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయినప్పటికీ షాలిని ఆ తర్వాత కూడా ఆ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
గేమ్‌లో మరోసారి కత్తుల వ్యవహారం రెండు జట్ల మధ్య పెద్ద గొడవకు కారణమైంది. బ్రేక్ సమయంలో షాలిని వద్ద ఉన్న కత్తిని తీసుకోవాలని అపూర్వ తన టీమ్ సభ్యులకు చెప్పింది. దీంతో షాలిని చుట్టూ మరో టీమ్ సభ్యులు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఆ కత్తిని తాను సృష్టికి ఇచ్చిన విషయాన్ని షాలిని చెప్పకపోవడంతో అపూర్వ టీమ్ సభ్యులు ఆమెను ప్రశ్నించారు. దీంతో రెండు జట్ల మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో షాలిని రోహిత్, అపూర్వలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిగున్ షాలినికి మద్దతుగా మాట్లాడటంతో రోహిత్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఒక దశలో ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.
చివరకు షాలిని భావోద్వేగానికి గురై ఏడ్చింది. టాస్క్‌లో మొదటి రౌండ్ ముగిసే సమయానికి భైరవ టీమ్ 32 బార్లు, సప్త శక్తి టీమ్ 19 బార్లు సొంతం చేసుకుంది. దీంతో మొదటి రౌండ్లో భైరవ టీమ్ ఆధిక్యంలో నిలిచింది.