Alcohol | న్యూఢిల్లీ, జనవరి 7: రాత్రివేళ ఓ రెండు పెగ్గులు (మద్యపానం) వేస్తేనే నిద్ర పడుతుందన్న దాంట్లో నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. అంతేకాదు.. రోజూ సాయంత్రం ఆల్కహాల్ తీసుకోవటం వల్ల సదరు వ్యక్తి గాఢ నిద్రకు దూరమవుతాడని, అతడిలో నిద్రపోయే విధానం దెబ్బతింటుందని అధ్యయనం పేర్కొన్నది. బ్రిటన్‌లో 4 వేల మందిపై పరిశోధకులు నెల రోజులపాటు ప్రయోగాలు జరపగా, అధ్యయన వివరాల్ని ‘ద వాషింగ్టన్ పోస్ట్’ తాజాగా వెల్లడించింది. ఆల్కహాల్ తీసుకోవటం ఆపేసిన తర్వాత గాఢంగా నిద్ర పోతున్నామని, ముందున్న సమస్యలు, ఆటంకాలు పోయాయని 56 శాతం మంది చెప్పారట.
బ్రిటన్‌లో సీనియర్ సైంటిఫిక్ అడ్వయిజర్‌గా ఉన్న ఆరాన్ వైట్ మాట్లాడుతూ, ‘ఆల్కహాల్‌ను వదిలేస్తే ఇంతకు ముందున్న గాఢ నిద్రను పొందొచ్చు. కొంతమంది ఉదయాన్నే నిద్రలేవటం మొదలవుతుంది’ అని అన్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అధికార ప్రతినిధి, క్లినికల్ సైకాలజిస్ట్ జెన్నిఫర్ మార్టిన్ మాట్లాడుతూ, ‘రాత్రి సమయంలో ఒక సగం గ్లాస్ వైన్ తీసుకుంటే.. నిద్రపై ప్రభావం చూపుతున్నది. కొన్నేండ్ల క్రితం ఆల్కహాల్ తీసుకోవటాన్ని ఆపేసి.. నన్ను నేను పరిశీలించుకున్నా. సాయంత్రం ఒక్క గ్లాస్ వైన్ ఆపేశా. రాత్రి నిద్ర ఎంతగానో మెరుగుపడింది’ అని అన్నారు. క్రమంగా మద్యపానాన్ని విడిచిపెడితే మెరుగైన, మంచి నిద్రను పొందొచ్చునని పరిశోధకులు తెలిపారు.