ఫర్టిలైజర్సిటీ, మే 30: కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టొదని, వెంటనే ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని బీజేపీ సీనియర్ నేత బండారి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్లో విలేకరలతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు మరమ్మతులు లేక 13 జిల్లాల రైతాంగానికి సాగునీరందడం లేదని వాపోయారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్డీఎస్ బృందం జియోఫిజికల్ సర్వే నిర్వహించి, ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని నివేదిక ఇచ్చినా.. ప్రభుత్వం చిత్తశుద్ధి కనబర్చడం లేదని మండిపడ్డారు. లక్షకోట్లతో నిర్మించిన ప్రాజెక్టును రాజకీయాల కారణంగా వదిలివేయడం సరికాదని సూచించారు. కాళేశ్వరానికి మరమ్మతులు చేయని ప్రభుత్వం.. నేడు తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ఆలోచన చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
గోదావరి విస్తరించిన జిల్లాల్లో తెలంగాణకు 40శాతం హకు ఉన్నదని, ఏటా 2వేల టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృథాగా ఉండటంతో రాష్ట్రంలో సాగునీటి ఎద్దడితోపాటు భూగర్భ జలాలు అడుగంటాయని విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. రానున్నరోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల కోసం ప్రజా ఉద్యమాన్ని చేపడుతామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మూరి అమరేందర్రావు వనిత, జిల్లా అధ్యక్షుడు కర్రు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.