ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన గ్లోబల్ వండర్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’. ఈ చిత్రం తాజాగా ‘ఎండ్‌గేమ్ ఎన్కోర్’ (Endgame Encore) పేరుతో మళ్లీ థియేటర్లలోకి వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వెర్షన్లో మేకర్స్ ప్రత్యేకంగా జోడించిన 4 నిమిషాల అదనపు ఎక్స్‌క్లూజివ్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కొత్త సన్నివేశాలను పెద్ద తెరపై వీక్షించేందుకు అభిమానులు భారీగా థియేటర్లకు తరలివస్తున్నారు.
దేశవ్యాప్తంగా దాదాపు 3600 స్క్రీన్లలో శుక్రవారం గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజే రూ. 7.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది. ఇప్పటివరకు మన దేశంలో రీ-రిలీజ్ ద్వారా మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి ది ఎపిక్’ (రూ. 5 కోట్లు) పేరిట రికార్డు ఉండేది. ఇప్పుడు ‘ఎండ్‌గేమ్ ఎన్కోర్’ ఆ రికార్డును సునాయాసంగా తుడిచిపెట్టేసి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
థియేటర్లలో కనిపిస్తున్న ఈ రెస్పాన్స్ చూస్తుంటే, రాబోయే మార్వెల్ చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతటి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారో స్పష్టమవుతోంది. రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇన్నాళ్లూ హీరోగా మెప్పించిన రాబర్ట్ డౌనీ జూనియర్, ఈసారి డాక్టర్ డూమ్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించబోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ‘ఎండ్‌గేమ్ ఎన్కోర్’ రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రాబోయే ‘డూమ్స్‌డే’ మూవీకి గట్టి పునాది వేసిందనే చెప్పాలి.