లండన్ : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల కథ ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పోరులో టీమిండియా.. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడి గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. భారత్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించారు. ఎలీస్ పెర్రీ (38 బంతుల్లో 56, 8 ఫోర్లు), ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డ్నర్ (29 బంతుల్లో 53 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో టీ20 ప్రపంచకప్‌లో ఉమెన్ ఇన్ బ్లూకు నిరాశ తప్పలేదు.
బౌలింగ్ వైఫల్యంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. అంతకుముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 56, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకానికి తోడు స్మృతి మంధాన (38), షెఫాలీ వర్మ (34), జెమీమా రోడ్రిగ్స్ (34) రాణించడంతో భారత్.. నిర్ణీత ఓవర్లలో 170/4 పరుగులు చేసింది. ఈ ఓటమితో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించగా గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా (10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) సెమీస్‌కు దూసుకెళ్లాయి. అంతకుముందు సఫారీ జట్టు.. 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ మార్గాన్ని సుగమం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించింది. గత మ్యాచ్‌లతో పోలిస్తే కీలక పోరులో ఓపెనర్లతో పాటు మిడిలార్డర్లో హర్మన్‌ప్రీత్ దూకుడుగా ఆడి జట్టుకు భారీ స్కోరును అందించింది. ఇక ఛేదనలో 4 పరుగులకే ఆసీస్ తొలి వికెట్ కోల్పోగా మూనీ (22), లిచ్‌ఫీల్డ్ (24) నిలకడగా ఆడి ఆ జట్టును పోటీలోకి తెచ్చారు. ఈ ఇద్దరి నిష్క్రమణ తర్వాత వచ్చిన పెర్రీ, ఆష్లీ భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పనిపూర్తిచేశారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 57 బంతుల్లోనే వంద పరుగులు జోడించి భారత్‌కు విజయాన్ని దూరం చేశారు.
భారత్: 20 ఓవర్లకు 170/4 (హర్మన్‌ప్రీత్ 56, స్మృతి 38, మొలినొ 2/46)
ఆస్ట్రేలియా: 19 ఓవర్లకు 172/4 (పెర్రీ 56, ఆష్లీ 53*, చరణి 2/32, దీప్తి 1/31)