సుల్తాన్‌బజార్,డిసెంబర్ 9 : సెంట్రలైజ్డ్ అప్రెంటిస్‌షిప్ జాబ్ఫెయిర్తో విద్యార్థులు తమ వృత్తిని ప్రారంభించడానికి ఎంతో మంచి అవకాశం లభించిందని సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి జె.శ్రీనాథ్ పేర్కొన్నారు. మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, ఎంహెచ్ఆర్డీ, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌తో కలిసి రెండురోజులపాటు నిర్వహించే సెంట్రలైజ్డ్ అప్రెంటిస్‌షిప్ జాబ్‌ఫెయిర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జాబ్‌ఫెయిర్‌లో 3 వేలమందికి ఉపాధి దక్కడం అభినందనీయమన్నారు.ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ఫెయిర్తో విద్యార్థులు అనేక పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చని, నేరుగా యాజమాన్యాలను కలిసే అవకాశముందన్నారు. ఎఫ్‌టీసీసీఐ హెచ్ఆర్ అండ్ ఐఆర్ కమిటీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ సాధారణంగా ఒక వ్యక్తి ఒకేరోజు మూడు కంపెనీలను సందర్శించడం సాధ్యం కాదని, రాబోయే తరానికి ఈ జాబ్‌ఫెయిర్ వేదికగా నిలుస్తుందన్నారు. సాంకేతిక విద్యాశాఖ జేడీ పుల్లయ్య, ఎఫ్‌టీసీసీఐ సీనియర్ డైరెక్టర్ అరవింద్ మాథూర్, సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ భరత్ పాల్గొన్నారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్, భారత్ డైనమిక్, సింగరేణి కాలరీస్, వీఎస్టీ ఇండస్ట్రీస్, సీయెంట్, ఏషియన్ పెయింట్స్, ట్రిజియో, ఓజాస్, పొకర్ణ, సాండ్విక్, న్యూక్లియానిక్స్ సిస్టమ్స్,క్యాప్స్టన్, టెక్‌వేవ్, మహాలక్ష్మి తదితర కంపెనీలు జాబ్‌ఫెయిర్‌కు హాజరయ్యాయి.