Anaswara Rajan | మలయాళం ఇండస్ట్రీలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయిక అనస్వర రాజన్ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా మారుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఈ మలయాళీ బ్యూటీ.. తాజాగా మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టాలీవుడ్లో ఆమె జోరు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.ప్రస్తుతం అనస్వర రాజన్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో ‘కాకా’ మాత్రం ఆమె కెరీర్లోనే అత్యంత కీలకమైన చిత్రంగా నిలవనుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో అనస్వర ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్రపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరింత క్యూరియాసిటీని పెంచింది.
అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా ‘కాకా’ చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో అనస్వరను ఎంబీబీఎస్ విద్యార్థిని అమ్ములుగా పరిచయం చేశారు. చాలా సహజమైన, హోమ్లీ లుక్‌లో కనిపిస్తున్న ఆమె ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సాధారణ గ్లామర్ లుక్కు భిన్నంగా.. ఓ మెడికల్ స్టూడెంట్‌గా అనస్వరను చూపించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె పాత్ర సినిమాకు కథాపరంగా ఎంత ముఖ్యమో పోస్టర్లోనే హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అనస్వర వెనుక భాగంలో నీడలా కనిపిస్తున్న చిరంజీవి పాత్ర.. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై ఆసక్తిని పెంచుతోంది.‘కాకా’ సినిమాలో అనస్వర రాజన్ చిరంజీవి కూతురు ‘అమ్ములు’ పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తండ్రి-కూతుళ్ల అనుబంధం సినిమాకు కీలకమైన ఎమోషనల్ పాయింట్‌గా ఉండే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఫస్ట్ లుక్‌లో చిరంజీవిని నేరుగా చూపించకుండా ఆయన నీడను మాత్రమే హైలైట్ చేయడం ద్వారా.. అమ్ములు జీవితంలో ఆయన పాత్ర ఎంత కీలకమో చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. దీంతో సినిమాలో అనస్వర పాత్ర కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథలో బలమైన ప్రాధాన్యత కలిగి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మలయాళ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన అనస్వర రాజన్.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస ప్రాజెక్టులను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఆమె నటించిన తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటుండగా.. తాజాగా ‘అంతా రాములోరు చూసుకుంటారు’ చిత్రానికి కూడా సైన్ చేసింది.దీంతో తెలుగులో ఆమె చేయబోయే సినిమాల సంఖ్య నాలుగుకు చేరినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ‘కాకా’ మాత్రం భారీ స్టార్ హీరోతో కలిసి నటిస్తున్న కారణంగా ఆమె కెరీర్‌కు మరింత కీలకంగా మారనుంది.మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం అనస్వరకు పెద్ద ప్లస్‌గా మారనుంది. ముఖ్యంగా తండ్రి-కూతుళ్ల బంధం చుట్టూ కథనం సాగితే.. ఆమె నటనకు మంచి స్కోప్ ఉండే అవకాశం ఉంది.