వాషింగ్టన్, ఏప్రిల్ 26: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా తీరుపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను అభిశంసించాలని 55 శాతానికిపైగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్‌పై ట్రంప్ ఏకపక్షంగా సాగిస్తున్న యుద్ధాన్ని 66 శాతానికిపైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ స్థాయి సర్వే తెలిపింది. ఇరాన్ యుద్ధం పేరుతో అమెరికా చేస్తున్న వ్యయం సరైంది కాదని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. ఏప్రిల్ 10-14 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 1,514 అమెరికన్ వయోజనులు పాల్గొన్నారు. ట్రంప్‌ను అభిశంసించాలా? అన్నదానికి 37 శాతం మంది వ్యతిరేకించగా, మరో 8 శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారు. ట్రంప్ పాలనా తీరుపై మొత్తంగా 61 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సర్వే చెబుతున్నది. ఆర్థికం, ఉపాధి రంగాల్ని ట్రంప్ నిర్వహిస్తున్న తీరును 60 శాతం మంది వ్యతిరేకించారు. విద్య, వైద్యం, సామాజిక కార్యక్రమాలు, నేరాలు, ప్రజా భద్రత, ఎన్నికలు, ప్రజాస్వామ్యం.. తదితర అంశాల్లో అన్నింటా ట్రంప్‌నకు తక్కువ మార్కులే పడ్డాయి.