‘చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ మనుగడ లేదు. పరిమిత బడ్జెట్ సినిమాల వల్లే నూతన ప్రతిభ వెలుగులోకి వస్తుంది.’ అని చెప్పింది సుప్రియ. అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అన్నపూర్ణ స్టూడియోస్ సీఈవోగా, నిర్మాతగా పేరు సంపాదించుకుంది. సుప్రియ నిర్మించిన తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సుప్రియ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
తాతయ్య ఏఎన్నాఆర్‌తో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది?
తాతయ్య ఏఎన్నార్‌ను చాలా మిస్సవుతున్న ఫీలింగ్ కలుగుతున్నది. తాతయ్య చనిపోవడానికి పదేళ్ల ముందు నుంచి ఆయనతో అనుబంధం ఎక్కువగా పెరిగింది. ఆయనకు చాలా దగ్గరయ్యా. తాతయ్య ఆలోచనలను అర్థంచేసుకునే పరిణతి రావడంతో నాతో అనేక విషయాలు పంచుకునేవారు. ఇద్దరం కూర్చొని గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. మమ్మల్ని చూసి అందరూ అంతలా ఏం మాట్లాడుకుంటుంటారు అని అనుకునేవారు.
అన్నపూర్ణ స్టూడియో నిర్వహణ బాధ్యతలు ఎలా అనిపిస్తున్నాయి?
స్టూడియో బాధ్యతల్ని నేను ఎప్పుడూ బరువుగా ఫీలవ్వను. బాధ్యతగా, నా సొంత పనిగానే భావిస్తుంటా. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేసే సినిమాలకు సంబంధించిన కథలన్నీ వింటా. నాకు నచ్చిన వాటిలో నుంచి కొన్ని కథలను నాగార్జునతో పాటు మా కుటుంబంలోని మిగతా హీరోలకు సరిపోతాయనిపిస్తే వారికి పంపిస్తుంటా.
సినిమా నిర్మాణంలో ఎదురయ్యే ఛాలెంజెస్ను మీరు ఎలా స్వీకరిస్తుంటారు?
సినిమా మేకింగ్ ప్రాసెస్‌ను నేను ఎంజాయ్చేస్తుంటా. కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిన్న సినిమా విజయం సాధించినప్పుడు వచ్చే కిక్ ఎక్కువ సంతృప్తినిస్తుంటుంది. అది నమ్మే ఈ సినిమా చేశా. శ్రీను గవిరెడ్డి చెప్పిన కథ విని సింగిల్ సిట్టింగ్‌లోనే సినిమాకు ఓకే చెప్పాను. పట్టణ సంస్కృతి కారణంగా మనం మిస్సయిన పల్లెటూరి ఆనందాల్ని గుర్తుకుతెస్తుంది. వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్టైలర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిస్తుంది.
‘గూఢచారి’ తో నటిగా రీఎంట్రీ ఇచ్చిన మీరు మళ్లీ సినిమాలు ఎందుకు చేయడం లేదు?
‘గూఢచారి’ తర్వాత ఎక్కువగా పోలీస్ పాత్రలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఒకే తరహా పాత్రలు చేయడం బోర్‌గా ఉంటుంది. అందుకే వచ్చిన అవకాశాల్ని తిరస్కరించా. ‘గూఢచారి-2’లో నా కోసం మంచిపాత్రను రాస్తున్నారు. గతంలో ఓ సినిమా చేస్తే ఎంత డబ్బులు మిగులుతాయి? ఎంత పోతాయనే లెక్కల గురించి ఆలోచించేదాన్ని. కథ నచ్చలేదని చెప్పడానికి మొహమాటంగా అనిపించేది. అలాంటి అయోమయం వల్ల ఏది మారదని అర్థం చేసుకున్నా. మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయాలని తాతయ్య నుంచి నేర్చుకున్నా. అదే సిద్ధాంతాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నా.
భవిష్యత్తులో మెగాఫోన్ పట్టే ఆలోచన ఉందా?
దర్శకురాలినవ్వాలనే కోరిక ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు చూసుకోవడం వల్ల సినిమాలకు సంబంధించి అన్ని విభాగాలపై పరిజ్ఞానం పెరిగింది. పెద్ద దర్శకులు, స్టార్స్‌తో ఎక్కువగా పనిచేయడం వల్ల ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా. నేను మెగాఫోన్ పట్టడం కంటే కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తే మరో పది మందికి అవకాశాలు ఇవ్చొచ్చు. అందుకే ప్రస్తుతం ఆ ప్రయత్నాలు చేయడం లేదు. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా.
‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా?
సంక్రాంతికి విడుదలచేయాలనే ఆలోచనతోనే ‘బంగార్రాజు’ను షూటింగ్ జరుపుతున్నాం. అయితే సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటికి సరిపడా థియేటర్స్ దొరకడం కష్టమే అవుతుంది. పోటీ ఎక్కువైతే అందరికి ఇబ్బంది ఉంటుంది. వాటిలో ఏ సినిమాలు విడుదలవుతాయి? ఏవి వాయిదాపడతాయనే సమీకరణాలను అనుసరించి ‘బంగార్రాజు’ రిలీజ్‌పై నిర్ణయం తీసుకుంటాం.