Actor Shiva Rajkumar | కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. తన పాన్-ఇండియా సినిమా ‘ఒరిజినల్ మాన్స్టర్’ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఆయన హిందీ తన రెండో భాష అని, అది మన జాతీయ భాష అని పేర్కొన్నారు. హిందీ డైలాగులు చెప్పడంపై ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. హిందీ చాలా సులువైన భాష అని, అది మన జాతీయ భాష అని, తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
కన్నడ సంస్కృతి, భాషాభిమానులు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు అభిమానులు మాత్రం ఆయనను సమర్ధిస్తున్నారు. దేశవ్యాప్తంగా మాట్లాడే భాష అనే కోణంలోనే ఆయన ఆ మాట అన్నారని, ఆయన ఎవరిని కించపరచలేదని వారు వాదిస్తున్నారు. మరోవైపు, ఈ వివాదంపై స్పందించిన ఒక నెటిజన్ ఆయన తండ్రి దివంగత దిగ్గజ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ ఈ వ్యాఖ్యలను చూసి నిరాశ చెందుతారని కామెంట్ చేశారు. కాగా, ఆర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘ఒరిజినల్ మాన్స్టర్’ సినిమాతో శివరాజ్‌కుమార్ హిందీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. 1990-2000 కాలం నాటి నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి.