హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): లంచం తీసుకొని ఏసీబీకి అడ్డంగా దొరికిన హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ మాజీ డీఎస్పీ గ్యార జగన్, అతనికి సహకరించిన సెక్యూరిటీ గార్డు బోనెల రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. జగన్ పదవిలో ఉండగా అక్రమ వెంచర్లు, భవనాల నిర్మాణదారులను బెదిరించి డబ్బులు వసూలుచేశారని అభియోగాలున్నాయి. నిజాంపేట బాచుపల్లికి చెందిన ప్రజాపతి కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ బొమ్మిన కోటేశ్వర్రావు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న అపార్టుమెంట్ నిర్మాణంలో ఉల్లంఘనలు చూసీచూడనట్టు వదిలేసి సహాయంచేస్తానని రూ.4 లక్షలు లంచంగా ఇవ్వాలని జగన్ డిమాండ్చేశారు.
ముందుగా రూ.2 లక్షలు రాము మధ్యవర్తిత్వంలో తీసుకున్నాడు. కోటేశ్వర్రావు ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి హబ్సిగూడలోని జగన్ నివాసంలో, ఇతర బంధువుల ఇండ్లు, హెచ్ఎండీఏ ఆఫీస్లో సోదాలు చేసి ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. బుధవారం కొన్ని లాకర్లు గుర్తించారు. విశ్లేషణ తర్వాత అక్రమాస్తులపై పూర్తిస్పష్టత వస్తుందని చెప్పారు.