(ఆకాశవాణి 90 ఏండ్లు పూర్తయిన సందర్భంగా)
కనిపించని స్నేహితుడివి నువ్వు
వినిపించే అనుబంధానివి నువ్వు
ఉదయపు తొలి కిరణంతో
ఇంటింటికీ చేరే ఆత్మీయ స్వరానివి
రైతు పొలంలో చెమట చుక్కల వెనుక
ఆశల పంటను పలికించే వేదికవు
నేల తల్లితో మాట్లాడే రైతు మాటలకు
నింగి దాకా దారి చూపే దూతవు
ఫ్యాక్టరీ సైరన్ మధ్య
కార్మికుడి కష్టగాథను మోసుకొచ్చే స్వరానివి
సామాన్యుని జీవితాన్ని
అసామాన్య కథగా వినిపించే కళాకారుడివి
కవి హృదయంలో మొలిచిన అక్షరాలకు
రెక్కలు తొడిగే ఆకాశానివి
పాటల పరిమళాన్ని
ప్రతి మనసులో చల్లే గాలివి
మరుగున పడిన మాణిక్యాలను
వెలుగులోకి తెచ్చే దీపస్తంభానివి
జ్ఞానాన్ని పంచే గురువువి
జీవితాన్ని అర్థం చేసే మిత్రుడివి
నవ్వులో తోడుంటావు
బాధలో ఓదార్పవుతావు
కాలం మారినా
నీ విలువ చెక్కుచెదరదు
తెరల హడావుడి మధ్య కూడా
నీ స్వరం మనసును
తాకుతూనే ఉంటుంది
ప్రజల ఆశలకు ప్రతిధ్వనివై
ప్రతిభలకు చిరునామావై
అక్షరాలకు, ఆలోచనలకు, అనుభూతులకు
ఆలంబనగా నిలిచే నువ్వు
రేడియో కాదు కేవలం ఒక సాధనం
ప్రజల గుండెచప్పుడు
సమాజం ఊపిరి
కాలంతో పాటు నడిచే జీవన గీతం
– డా.కొరుప్రోలు హరనాథ్
9703542598